25 July, 2026 | 1:51 AM

ఘనంగా గోరింటాకు వేడుకలు

25-07-2026 12:33 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 24 (విజయక్రాంతి): ఆషాఢ మాసం సందర్భంగా పద్మశాలి మహిళా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో గోరింటాకు వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని గోరింటాకును సేకరించి అమ్మవారికి నివేదించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబ సభ్యుల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు.

పూజల అనంతరం ఆడపడుచులు ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుని ఆషాఢ మాస విశిష్టతను చాటుతూ ఆనందోత్సాహాల మధ్య వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ పాటలు పాడుతూ, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్నారులు, యువతులు కూడా ఉత్సాహంగా పాల్గొనడంతో కార్యక్రమం సందడిగా సాగింది.ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది ఈ గోరింటాకు వేడుకలను నిర్వహిస్తున్నట్లు మహిళా సంఘం సభ్యులు తెలిపారు.

గోరింటాకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, ప్రకృతి సిద్ధమైన గోరింటాకు చేతులకు చల్లదనాన్ని అందించడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి సంప్రదాయ వేడుకలు కుటుంబ బంధాలను, సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని  అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు జంజిరాల పుష్పలత, కోశాధికారి అనుమాండ్ల క్రాంతి, గౌరవ అధ్యక్షురాలు వనమాల జయ, ప్రచార కార్యదర్శి గుజ్జ రేవతి, ఇరుకుల్ల పుష్పలత, అనుమాండ్ల సుజాత, అనుమాండ్ల లహరి,పొన్న సంగీత, ఇరుకుల్ల కావ్య, ఇరుకుల్ల అనసూయ, ఆవిడపు రేఖ, రుద్ర రజిని, పొన్న లత, నల్ల విజయ తదితరులు పాల్గొన్నారు.