పాలేరు దివ్య క్షేత్రాల్లో వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనలు
ఈశ్వరమాధారం... హస్నాబాద్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు
మంత్రి పొంగులేటి సతీమణి పొంగులేటి మాధురి
కూసుమంచి, తిరుమలాయపాలెం, జులై 9 (విజయక్రాంతి): పాలేరు నియోజకవర్గ పరిధిలో గురువారం ఆధ్యాత్మిక సౌరభం వెల్లివిరిసింది. కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో అత్యంత వైభవంగా నిర్వహించిన నూతన ఆలయాల విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాలలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సతీమణి పొంగులేటి మాధురి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా మాధారేశ్వరుని ప్రతిష్ఠ...
కూసుమంచి మండలం ఈశ్వరమాధారంలో శ్రీ పార్వతీ సమేత ఈశ్వర మాధారేశ్వర స్వామి వారి శివలింగ, ధ్వజస్తంభ, చండీశ్వర ప్రతిష్ఠాపనలు శాస్త్రోక్తంగా సంపన్నమయ్యాయి. వీటితో పాటు నవగ్రహ, నాగేంద్రస్వామి, గ్రామ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. మూడవ రోజు వేడుకల్లో భాగంగా జరిగిన వేదమంత్ర హోమాలు, స్థిర యంత్ర స్థాపన, మహా పూర్ణాహుతి క్రతువుల్లో పాల్గొన్న పొంగులేటి మాధురికి అర్చకులు స్వాగతం పలికి వేదాశీర్వచనం అందించారు.
సీతారాముల కలశ ప్రతిష్ఠ
తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ సీతా సమేత శ్రీ రామాంజనేయ స్వామి వారి ఆలయ ధ్వజస్తంభ, శిఖర కలశ ప్రతిష్ఠాపన ముగింపు వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పర్యటనలో భాగంగానే బచ్చోడు గ్రామంలోని మహిమాన్విత శ్రీ రామాలయాన్ని కూడా ఆమె సందర్శించి తారకరాముని దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్నారు.
నూతన వధూవరులకు ఆశీస్సులు...
అదేవిధంగా పాలేరు గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని పొంగులేటి మాధురి నూతన వధూవరులను ఆశీర్వదించారు. పట్టు వస్త్రాలను కానుకగా బహూకరించారు.






