10 July, 2026 | 1:05 AM

ఆగస్టు 7న ఓబీసీ విద్యార్థుల మహాసభ

10-07-2026 12:00 AM
  1. హైదరాబాద్‌లో తొలి జాతీయ సభ
  2. సామాజిక న్యాయ ఉద్యమానికి దిశానిర్దేశం 
  3. మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆగస్టు 7న హైదరాబాద్‌లో తొలి జాతీయ ఓబీసీ విద్యార్థుల మహాసభ, మండల్ దివస్ వేడుకలు నిర్వహించనున్నట్టు మాజీ డీజీపీ, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఓబీసీఎస్‌ఏ) జాతీయ అధ్యక్షుడు డా. జె. పూర్ణచంద్రరావు వెల్లడించారు. నాంపల్లిలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓబీసీలు దేశ జనాభాలో సగానికి పైగా ఉన్నప్ప టికీ కేంద్ర ప్రభుత్వ ఉన్నత పదవులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకాలు, పార్లమెంట్, శాసనసభలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం జనాభా నిష్పత్తికి ఏమాత్రం సరిపోవడం లేదన్నారు.

మహిళలు దేశ జనాభాలో దాదాపు 50 శాతం ఉన్నప్పటికీ పార్లమెంట్‌లో వారి ప్రాతినిధ్యం కేవలం 14 శాతానికే పరిమితమైం దన్నారు. బీసీలలో వందకు పైగా కులాలు ఇప్పటికీ శాసనసభలు, పార్లమెంట్లో సరైన ప్రాతినిధ్యానికి నోచుకోలేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కులగణన నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ, ఓబీసీ కులాల పూర్తి వివరాలు నమోదు చేసే స్పష్టమైన విధానం ఇంకా ప్రకటించలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీతో పాటు వివిధ ప్రాంతీయ పార్టీలు కూడా ఓబీసీలకు జనాభా నిష్పత్తిలో హక్కులు కల్పించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు, ఆంధ్రప్ర దేశ్‌లో స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల హామీలు పూర్తిగా అమలు కాలేదని చెప్పారు.

బీసీ రక్షణ చట్టం తీసుకురావడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. ఏఐఓబీసీఎస్‌ఏ జాతీయ అధ్యక్షుడు డా. జి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో తొలిసారిగా జాతీయ స్థాయిలో ఓబీసీ విద్యార్థులను ఒకే వేదికపై సమీకరిస్తున్న మహాసభ ఇదేనని అన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థి నాయకులు, పరిశోధకులు, మేధావులు, ప్రజాప్రతినిధులు, సామాజిక ఉద్యమకారులు ఈ మహాసభలో పాల్గొని ఓబీసీ సమాజ భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తారని తెలిపారు.

ఈ చారిత్రాత్మక మహాసభ ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు మాట్లాడుతూ.. కులగణన ఆధారంగా శాస్త్రీయ విధానాలతో ప్రభుత్వాలు విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగబ ద్ధమైన ఓబీసీ హక్కుల పరిరక్షణకు ఈ మహాసభ కీలక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.

అమెరికాలోని బీసీ ఎంప్లాయీస్ థింక్ ట్యాంక్ ప్రతినిధి శ్రీ వెంకట్ మారోజు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయ ఓబీసీలు కూడా సామాజిక న్యాయ ఉద్యమాలకు అండగా నిలుస్తు న్నారని తెలిపారు. ఈ సమావేశంలో సంగెం సూర్యారావు (వ్యవస్థాపకులు, బీసీ టైమ్స్), సైదులు దేవరకొండ (అధ్యక్షుడు, ఎస్టీఎఫ్), మహేష్ గౌడ్ (జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏఐఓబీసీఎస్‌ఏ), గంగాధర్ లక్ష్మీనర్సయ్య (అధ్యక్షుడు, ఏఐఓబీసీఎస్‌ఏ, హైదరాబాద్ విశ్వవిద్యాలయ విభాగం), వసుమతి యాద వ్, కొండల్, శివ యాదవ్ పాల్గొన్నారు.