8 May, 2026 | 12:35 AM

పుల్లాయిగూడెంలో వైభవంగా ఆధ్యాత్మిక వేడుకలు

08-05-2026 12:05 AM

విశేష హోమాలు, జలాధివాసం, ధాన్యాధివాస కార్యక్రమాల నిర్వహణ

పాల్వంచ, మే 7, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పుల్లాయిగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక మహోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆలయ నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు.

ఉదయం 7-30 గంటల నుండి చటుస్సాన్నులు, ఆవాహిత దేవతాహోమములు, విశేష మహాసుదర్శన హోమము, గరుడ మహామంత్ర హోమములు వేదమంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు. అనంతరం విశ్వశాంతి, సకల శుభసంపదల కోసం జలాధివాస కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మధ్యాహ్నం నీరాజన మంత్రపుష్పములు, తీర్థప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు.

సాయంత్రం వేదపారాయణాలు, మూలమంత్ర హోమములు, అంగహోమములు, స్పర్శహోమములు, కళాహోమములు, ప్రా ణాది దశవాయువాస హోమములు, కళాన్యాస హోమములు నిర్వహించారు. అనంతరం ధాన్యాధివాసము, పుష్పాధివాసము కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలను తిలకించేందుకు పరిసర గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ధాన్యాధివాస కార్యక్రమంలో భక్తులు తమ శక్తికొలది ధాన్యమును సమర్పించి స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తుల సమర్పణలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాత్రి నీరాజన మంత్రపుష్పములు, చతుర్వేద స్వస్తి, తీర్థప్రసాద గోష్టితో కార్యక్రమాలు ముగిశాయి. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.