టీఎంయూఎస్‌తో మరింత గుర్తింపు
అమెరికాలోనే అతిపెద్ద వైర్‌లెస్ నెట్‌వర్క్
వచ్చే ఏడాది వెయ్యి మందికి ఉద్యోగాలు
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
హైటెక్ సిటీలో టీఎంయూఎస్ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): సాంకేతికత, ఇంజనీరింగ్, జీవ విజ్ఞానాల ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ గ్లోబల్ కంపెనీలను ఆకర్షిస్తుందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన ఎకోసిస్టం ఎంతగానో దోహదపడుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
విభిన్న రంగాలకు చెందిన మానవవనరులు అందుబాటులో ఉన్నందున అనేక సంస్థలు తమ నూతన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయని, తదుపరి విస్తరణల కోసం ఇక్కడి వస్తున్నాయని వెల్లడించారు. అమెరికా టెలికాం దిగ్గజం టీఎంయూఎస్ (టీ-మొబైల్ యూఎస్) గ్లోబల్ సొల్యూషన్స్ నూతన గ్లోబల్ టెక్నాలజీ సెంటర్‌ను హైటెక్ సిటీలో గురువారం మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ భారీ టెక్నాలజీ సెంటర్.. వచ్చే ఏడాది చివరి నాటికి 1000 మంది నిపుణులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని తెలిపారు.
ఇప్పటికే 450 జీసీసీ కేంద్రాలకు నెలవుగా మారిన హైదరాబాద్.. ఈ ఆధునిక కేంద్రంతో మరింత గుర్తింపును తెచ్చుకుంటుందన్నారు. సెమీ కండక్టర్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్, రిటైల్, జీవ విజ్ణానం (లైఫ్ సైన్సెస్), బ్యూటీ రంగాలకు సంబంధించిన జీసీసీ కేంద్రాలు ఇక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయని చెప్పారు.
500 ఫార్చ్యూన్- కంపెనీలు తెలంగాణలో జీసీసీలు, సాంకేతిక కేంద్రాలు ఏర్పా టు చేసినట్లు తెలిపారు. టీ-మొబైల్ యూ ఎస్.. అమెరికాలోని అతిపెద్ద వైర్‌లెస్ నెట్‌వర్క్ ఆపరేటర్లలో ఒకటిగా పేరుగాంచింద న్నారు. ఇది 14 కోట్లకు పైగా వినియోగదారులకు సేవలు అందిస్తూ, తదుపరి తరం కనెక్టివిటీ పరిష్కారాలకు అవకాశం కల్పిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ గ్లోబల్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ చంద్రగుప్త, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






