రామగుండం కోల్‌మైన్‌కు గ్రీన్‌సిగ్నల్
- ప్రాజెక్ట్‌కు పర్యావరణ శాఖ అనుమతి
- మరో 10 రోజుల్లో పత్రాలు రాక
హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): సింగరేణి సంస్థ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వినూత్నమైన రామగుండం కోల్‌మైన్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ ఇటీవల ప్రాథమిక అనుమతుల మంజూరుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు కేంద్ర పర్యావ రణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ నుంచి సింగరేణి యాజమాన్యానికి శుక్రవారం సమాచారం అందింది. 10 రోజుల్లో అనుమతి పత్రాలు రానున్నాయి. సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి మార్గనిర్దేశంలో డైరెక్టర్లు, అధికారులు చేసిన ప్రయ త్నాలు ఫలించాయి.
సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా ఏడాదికి 210 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యంతో రూ పొందించిన ఈ వినూత్న ప్రాజెక్టుకు ప్రాథమిక పర్యావరణ అనుమతులు లభించడం పట్ల సింగరే ణి యాజమాన్యం హర్షం ప్రకటిస్తోంది. మూతపడుతున్న పాత గనుల ఉత్పత్తిని భర్తీ చేయడానికి, ఇప్పటికే కనీస అనుమతులు ఉన్న 2 ఓపెన్ కాస్ట్ గనులు, 3 భూగర్భ గనుల పరిధిలోని బొగ్గును ఇంకా తవ్వి తీయటానికి అనువుగా ఉన్న 314.98 మిలియన్ టన్నుల నిల్వలను ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాజెక్టును రూపొందించారు.
ఇక్కడ ఉత్పత్తి చేసే బొగ్గు ప్రధానంగా సమీపంలోని ఎన్టీపీసీ రామగుండం వారికి, ఇతర బొగ్గు ఆధారిత పరిశ్రమలకు ఇంధన సరఫరా ఒప్పందం ప్రకారం సరఫరా చేయనున్నారు. ఈ గనులకు ఆనుకొని ఉన్న రామగుండం ఓపెన్ కాస్ట్-1 విస్తరణ ప్రాజెక్టు ఫేజ్-2, రామగుండం ఓపెన్ కాస్ట్--2 విస్తరణ ప్రాజెక్టు, అడ్రియాల షాఫ్ట్ అండర్ గ్రౌండ్ విస్తరణ ప్రాజెక్టుల అంచులలో మిగిలిన బొగ్గును కూడా గరిష్టంగా వెలికి తీస్తారు. వీటన్నిటినీ కలిపి రామగుండం కోల్ మైన్ అనే ఒక విశిష్ట ప్రాజెక్టుకు కంపెనీ రూపకల్పన చేశారు.
మూతపడుతున్న గనుల ఉత్పత్తిని భర్తీ చేసుకోవడంతోపాటు ఈ గని రామగుండం రీజియన్‌కు మరో 25 సంవత్సరాల జీవిత కాలాన్ని అందించనుంది. ఈ మొత్తం ప్రాజెక్టుకు 4326.08 హెక్టార్ల విస్తీర్ణం గల భూమి అవసరం ఉంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 5,403 మంది సింగరేణి ఉద్యోగులు, మరో 600 మంది కాంట్రాక్టు సిబ్బంది పనిచేయనున్నారు. మొత్తం 2,194.05 కోట్ల మూల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.






