4 May, 2026 | 1:00 AM

సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు

04-05-2026 12:00 AM
  1. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు కూడా..
  2. ప్రధానంగా నాలుగు డిమాండ్లపై స్పష్టమైన హామీ
  3. పీఆర్సీ, హెల్త్ కార్డుల జారీ, పెన్షనర్ల బకాయిల విడుదలకు సానుకూలం
  4. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కూలంకషంగా చర్చించి, వాటికి పరిష్కారం చూపుతామని హామీనిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో ఆదివారం సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం తమ సమస్యలపై చర్చించారని, ప్రధానంగా నాలుగు డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చారని వెల్లడించారు. పీఆర్సీ, హెల్త్ కార్డుల జారీ, పెన్షనర్ల బకాయిలు, ఓల్డ్ పెన్షన్ స్కీం సమస్యలకు సత్వర పరిష్కారం చూపుతామని తెలిపారని వివరించారు. రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులు చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్నాయని, వంద రోజుల్లో రూ.6 వేల కోట్లు చెల్లిస్తా మని సీఎం హామీ ఇచ్చారన్నారు.

బకాయిల చెల్లింపుల కోసం ప్రతి నెలా రూ.వెయ్యి కోట్లు కేటా యిస్తామని తెలిపారని వివరించారు. పీఆర్సీ రిపో ర్ట్ అందగానే దాన్ని అమలు చేస్తానని చెప్పారని గుర్తుచేశారు. సీఎం సానుకూల స్పందనతో తమ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణను రద్దు చేసుకుంటున్నామని స్పష్టం చేశారు.

1 సెప్టెంబర్ 2024 కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు ఓపీ ఎస్ అమలుపై డిప్యూటీ సీఎం భట్టితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. యేటా సెప్టెంబర్ 1 నుంచి ఆగస్టు 31 వరకు ఏర్పడే ఖాళీలన్నింటినీ పరిగణలోకి తీసుకుని, డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ ఒకేసారి ఆమోదించాలని, దీంతో ఖాళీ ఏర్పడిన ప్రతిసారి కొత్తగా డీపీసీ ని ర్వహించే అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. 

ఉద్యోగుల కోసమే జేఏసీ: ఏలూరి 

టీజీ ఉద్యోగుల జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూ రి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులో ఉన్నప్పటికీ ఉద్యోగుల డిమాండ్లపై సీఎం హామీ ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. సచివాలయంలో నిరసన చేసినా తాము అడ్డుకొ బోమని, నిరసన తెలిపే హక్కు తమకు ఉందని సీఎం చెప్పడం హర్షణీయమన్నారు. మొత్తం 63 డిమాండ్లలో 26 డిమాండ్లు పూర్తిగా పరిష్కారమయ్యాయని తెలిపారు. మిగిలిన 37 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు.