7 June, 2026 | 6:31 PM

పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసు.. మరో నిందితుడి అరెస్టు

07-06-2026 05:36 PM

హైదరాబాద్: గత నెలల్లో కరీంనగర్ లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో దుర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ నేరంలో ఉపయోగించిన రెండు పిస్టల్స్, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని, మరో ప్రధాన నిందితుడిని బీహార్‌లో అరెస్టు చేశారని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదివారం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం... ప్రధాన నిందితులు ముగ్గురు సుబోధ్ సింగ్ (A-1), రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగీరా సింగ్ (A-2), రవీష్ కుమార్ అలియాస్ ప్రద్యుమన్ (A-3), నాలుగు రోజుల కస్టడీ జూన్ 7న ముగిసింది. కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా జూన్ 3 నుండి జూన్ 7 వరకు నిందితుల కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

విచారణ సమయంలో A-2, A-3 అందించిన సమాచారం ఆధారంగా జ్యువెలరీ షాప్ దోపిడీకి  ఉపయోగించిన రెండు పిస్టల్స్‌ను, మొబైల్‌ ఫోన్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెలిశాల బైపాస్ రోడ్డు దగ్గర చెట్లపొదల్లో ఈ ఆయుధాలను దాచి ఉంచారు. అలాగే, ధర్మపురి మార్గంలోని మద్దునూరు గ్రామం సమీపంలో ఉన్న అటవీ ప్రాంతం నుండి, ఈ నేరంతో సంబంధం ఉన్న సిల్వర్-పింక్ రంగు వివో (Vivo) మొబైల్ ఫోన్‌ను కూడా దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.దర్యాప్తులో నిందితులు పూర్తిగా సహకరించడం లేదని, దొంగిలించిన బంగారం, వజ్రాల ఆభరణాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని దాచిపెడుతున్నారని పోలీసులు తెలిపారు. 

దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగా, దొంగిలించిన విలువైన వస్తువుల ఆచూకీ, వాటిని తరలించిన తీరుపై నిందితులు ఉద్దేశపూర్వకంగానే పరస్పర విరుద్ధమైన వాంగ్మూలాలు ఇచ్చారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. నిందితులపై మరింత విచారణ కోసం వారిని పోలీసు కస్టడీకి అప్పగించాలని కోరుతూ కోర్టులో కొత్తగా అభ్యర్థన దాఖలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో జూన్ 4న బీహార్‌లోని పాట్నా జిల్లా సలీంపూర్ ప్రాంతం నుండి మరో ప్రధాన నిందితుడైన అమర్ సింగ్ అలియాస్ పహిల్వాన్ అలియాస్ అమరేంద్ర కుమార్ సింగ్‌ (A-10)ను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక కోర్టు నుండి ట్రాన్సిట్ వారెంట్ పొందిన ప్రత్యేక పోలీసు బృందం, తదుపరి చట్టపరమైన చర్యల కోసం అతడిని కరీంనగర్‌కు తీసుకువస్తోంది. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను గుర్తించి, అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కమిషనర్ గౌష్ ఆలం చెప్పారు.