24 March, 2026 | 10:51 AM

నూతన సిటీ ట్రైనింగ్ సెంటర్ భవన నిర్మాణ శంకుస్థాపన

10-11-2025 08:57 PM

భూమి పూజలో పాల్గొన్న తెలంగాణ డిజిపి బి శివధర్ రెడ్డి..

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం..

మేడిపల్లి (విజయక్రాంతి): రోడ్డు సేఫ్టీపై ప్రత్యేక కార్యక్రమాలు, సైబర్ నేరాలను, అదుపు చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పోలీసులకు అవసరమని తెలంగాణ డిజిపి బి శివధర్ రెడ్డి అన్నారు. మేడిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న రాచకొండ కమిషనరేట్ ప్రాంగణంలో కమిషనర్ జి సుధీర్ బాబు ఆధ్వర్యంలో సిటీ ట్రైనింగ్ సెంటర్ ను సోమవారం డీజీపీ ముఖ్య అతిధులుగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆపై భూమి పూజలో పాల్గొని అక్కడే ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దివిస్ లేబరేటరీస్ లిమిటెడ్ చైర్మన్ మురళీకృష్ణ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా సుమారు నాలుగు కోట్ల రూపాయలతో సిటీ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు.

ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ రాచకొండ కమిషనరేట్ ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తున్న పూర్తిస్థాయి భవనాలు లేకపోవడం, ట్రైనింగ్ సెంటర్ కూడా లేకపోవడం కొంత లోపంగానే ఉందని అది నేటితో తీరుతుంది అన్నారు. సైబర్ క్రైమ్, రోడ్ సేఫ్టీ ల ముఖ్య ఉద్దేశంగా ఈ సిటీ ట్రైనింగ్ సెంటర్ ని ఏర్పాటు చేయడమైనదని, నేటి కాలంలో మనకు సెల్ ఫోన్, రోడ్డు మార్గం ప్రధానంగా అవసరమైందని, రోడ్డు సేఫ్టీ లలో తెలిసి తప్పులు చేస్తున్నామని అన్నారు. మన అజాగ్రత్త వలన ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.

సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా క్రైమ్ రేటు తగ్గిస్తున్నామని దొంగతనాల్లో సైబర్ క్రైమ్ దొంగతనాలు సెల్ ఫోన్ల ద్వారా జరుగుతున్నాయని, అందుకే వాటిపై ట్రైనింగ్ ఇవ్వడానికి సిటీ ట్రైనింగ్ సెంటర్ ను నిర్మించడం జరుగుతుందని అన్నారు. ప్రతి జిల్లాలో కూడా సిటీ ట్రైనింగ్ సెంటర్ అవసరం ఉందని, త్వరలో అంతట ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ  భవన నిర్మాణానికి దివిస్ లేబరేటరీ యాజమాన్యం నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చిందని యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాచకొండ సిపి సుధీర్ బాబు, దిలీప్ లాబరేటరీస్ ప్రతినిధులు, మల్కాజిగిరి డిసిపి పద్మజ, ఏసీపి చక్రపాణి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.