ఎస్టీ రిజర్వేషన్ల తీర్పుకు లోబడే గ్రూప్‌-1 నియామాకాలు

05-05-2024 01:55:07 AM

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): ఎస్టీ రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంపుదల జీవోకు అనుగుణంగా గ్రూపు  నియామకాలు తామిచ్చే తీర్పుకు లోబడి ఉండాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. గత నెల విడుదలైన గ్రూప్ 1 పోస్టుల భర్తీ నోటిఫికేషన్లో ఎస్టీలకు ౧౦ శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పీ శ్యాంసుందర్‌రెడ్డి, మరొకరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల న్యాయమూర్తులు జస్టిస్ అభినందకుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వ జీవో 22పై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ఫిబ్రవరిలో జారీ చేసిన గ్రూప్1 నోటిఫికేషన్లో నియామకాలు తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని షరతు విధించింది. ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ, న్యాయశాఖ, గిరిజన సంక్షేమశాఖల ముఖ్యకార్యదర్శులతోపాటు టీఎస్పీఎస్సీలకు ధర్మా సనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 28వ తేదీకి వాయిదా వేసింది.