మామిడి పచ్చడి మరింత పిరం

05-05-2024 01:56:44 AM

కాయలకు పెరిగిన డిమాండ్

అమాంతం పెరిగిన పచ్చడి సామాను ధరలు

జయశంకర్ భూపాలపల్లి, మే 4 (విజయక్రాంతి): ఎండాకాలం వచ్చిందంటే చాలు మే నెలలో ప్రతి ఇంట్లో మామిడికాయ తొక్కు తయారు చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు. నోరూరించే మామిడికాయ తొక్కు లేనిదే చాలా మందికి ముద్ద దిగదు. అయితే ఎండాకాలంలో మామిడి సీజన్‌లోనే పచ్చడి తయారు చేసుకుంటే ఏడాది పొడవునా చెక్కు చెదరదని వారి నమ్మకం. అలాంటిది ఈ ఏడాది మామిడి కొరత తీవ్రంగా ఏర్పడింది. వాతావరణంలో మార్పుల కారణంగా మామిడి ఎక్కువ దిగుబడులు రాకపోవడంతో పచ్చడి మామిడి దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు పచ్చడి మామిడి ధరలతో పాటు అందులో కలిపే సామానుల ధరలు కూడా అమాంతం పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది పచ్చళ్ల సీజన్ రావడంతో మామిడికాయలు పచ్చడికి అవసరమయ్యే సామగ్రికి అధిక ధరలు చెల్లించి పచ్చళ్లు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలామంది కూలీలు, రైతులు వ్యవసాయ పనులకు వెళ్లేటప్పుడు మామిడి పచ్చడితో చద్దన్నం తీసుకువెళతారు. ఇందు కోసం అధిక ధర చెల్లించైనా మామిడి పచ్చడి పెట్టక తప్పడం లేదు. 

నేలరాలిన పూత, కాత..

ఈ ఏడాది వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా మామిడి పూత, కాత దశలోనే నేలరాలింది. అక్కడక్కడా చెట్లకు కాసిన కాయలు ఇటీవల అడపాదడపా గాలివానలకు రాలిపోతున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా మామిడి కొరత ఏర్పడింది. దీంతో పచ్చడి మామిడికి ధరలు అమాంత పెరిగాయి. ఒక్కో కాయ రూ.5 నుంచి రూ. 10 వరకు కొనుగోలు చేస్తున్నారు. 20 కిలోల వరకు పచ్చడి తయారు చేసుకునే కుటుంబాలు 10 కిలోలతోనే సరిపుచ్చుకుంటున్నారు. 

ధరలు ఉన్నా తప్పడం లేదు..

మామిడికాయల ధరలు మండుతున్నాయి. ఒక్కో కాయకు రూ. 5 నుంచి రూ. 10 వరకు చెల్లించి తీసుకుంటున్నాము. అటవీ గ్రామాల్లో అక్కడక్కడా ఉన్న చెట్లకు కాయలు రాలిపోయాయి. దీంతో పట్టణ ప్రాంతాల్లోని మార్కెట్‌లకు వెళ్లి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధరలు మండుతున్నా పచ్చడి పెట్టక తప్పడం లేదు.

 అజ్మీరా విమల, రెడ్డిపల్లి

ధరలు పెరగడంతో..

ప్రస్తుతం మార్కెట్‌లో పచ్చడి సామగ్రి ధరలు మండిపోతున్నాయి. పచ్చళ్లకు అవసరమయ్యే కిలో కారం ధర రూ. 500 నుంచి రూ.600, జీలకర్ర కిలో రూ.700, నువ్వులు కిలో రూ. 200, ధనియాలు కిలో రూ.250, వెల్లుల్లి కిలో రూ. 350, అల్లం కిలో రూ.250, మెంతులు కిలో రూ.250, ఆవాలు కిలో రూ. 350, నూనె లీటర్ రూ. 180 వరకు ధరలు పలుకుతున్నాయి. మామిడికాయలతో పాటు సామగ్రి ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు పచ్చళ్లు పెట్టుకోవడానికి జంకుతున్నారు. రెడిమేడ్ పచ్చళ్లు రుచికరంగా ఉండవని చాలా మంది తమ ఇళ్లలోనే వాటిని తయారు చేసుకుంటారు.  

ధరలు ఆకాశాన్నంటాయి..

మార్కెట్‌లో పచ్చళ్లకు కావాల్సిన సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. ఇటు మామిడికాయలు అటు సరుకుల ధరలు పెరగడంతో పచ్చళ్లు పెట్టాలంటేనే భయమేస్తోంది. ప్రతి ఏటా 50 కాయలు పెట్టేవాళ్లం. ఈసారి 25 కాయలతోనే సరిపెట్టుకుంటున్నాం.

మల్లక్క, కోణంపేట