13 July, 2026 | 12:48 PM

జీఎస్టీ రికార్డు

02-05-2024 12:05 AM

 తొలిసారిగా ఒక నెలలో రూ.2 లక్షల కోట్లు దాటిన వసూళ్లు

న్యూఢిల్లీ, మే 1: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఈ ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయికి పెరిగాయి. గత ఏడాది ఇదేనెలతో పోలిస్తే 12.4 శాతం వృద్ధిచెంది రూ.2.10 లక్షల కోట్లకు చేరాయి. ఒకే నెలలో రూ.2 లక్షల కోట్ల మార్క్‌ను అధిగమించడం ఇదే  ప్రధమమని బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. తాజాగా ముగిసిన నెలలో దేశీయ లావాదేవీలు, దిగుమతులు పెరగడంతో ఈ ఫీట్ సాధ్యపడింది. ఏప్రిల్‌లో జీఎస్టీ దేశీయ లావాదేవీలు 13.4 శాతం, దిగుమతులు 8.3 శాతం అధికమైనట్టు ప్రకటన పేర్కొంది. జీఎస్టీ వసూళ్లు 2023 ఏప్రిల్‌లో రూ.1.87 లక్షల కోట్లుకాగా, 2024 మార్చి నెలలో రూ.1.78 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో మొత్తం జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ ద్వారా రూ.43,846 కోట్లు, స్టేట్ జీఎస్టీతో రూ.53,538 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీతో రూ.99,623 కోట్లు వచ్చాయి. రిఫండ్స్ పోను ఏప్రిల్ నెలలో నికరంగా రూ.1.92 లక్షల కోట్ల జీఎస్టీ వసూలయ్యింది. ఈ నికర వసూళ్ల వృద్ధి 15.5 శాతంగా ఉంది.

వేసవి ఎఫెక్ట్

ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డుస్థాయికి పెరగడానికి దేశవ్యాప్తంగా నెలకొన్న అధిక ఉష్ణోగ్రతలు ఒక ముఖ్య కారణమని ట్యాక్స్ కన్సల్టెన్సీ నెక్స్‌డిజిమ్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ ఛబ్రియా అభిప్రాయం వ్యక్తం చేశారు. వేసవితాపంతో ఎయిర్ ఎండీషనర్లు, శీతల పానీయాలు తదితరాల కొనుగోళ్లు జోరుగా పెరిగాయని, మరోవైపు పాఠశాలలు, కళాశాలల సెలవులతో ట్రావెలింగ్ పెరగడమూ జీఎస్టీ వసూళ్ల వృద్ధికి దోహదపడిందని వివరించారు.

తెలంగాణ వసూళ్లలో 11% వృద్ధి

తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు 2024 ఏప్రిల్ నెలలో 11 శాతం వృద్ధిచెంది రూ.6,236 కోట్లకు పెరిగాయి. గత ఏడాది ఏప్రిల్‌లో రూ.5,622 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చిలో రూ.5,399 కోట్లు జీఎస్టీ వసూలయ్యింది.