గోద్రేజ్ వాణిజ్య సామ్రాజ్యం విభజన
చీలిపోయిన 127 ఏండ్ల వ్యాపార కుటుంబం
లిస్టెడ్ కంపెనీలు ఆది గోద్రేజ్, నదిర్ చేతికే
అన్‌లిస్టెడ్ కంపెనీలు, ల్యాండ్ బ్యాంక్ జంషెడ్, స్మిత చెంతకు
న్యూఢిల్లీ మే 1: సబ్బుల నుంచి గృహో పకరణాలు.. రియల్ ఎస్టేట్‌లో వేళ్లూను కున్న 127 ఏండ్ల గోద్రేజ్ గ్రూప్ చీలిపోయిం ది. వారసులు ఈ వ్యాపారా లను పంచుకోవడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఆది గోద్రేజ్ (82), ఆయన సోదరుడు నదిర్ గోద్రేజ్ (73)లకే ఫ్లాగ్‌షిప్ కంపెనీ గోద్రేజ్ ఇండస్ట్రీస్ దక్కుతుంది. దీనికి సబ్సిడరీలైన ఐదు లిస్టెడ్ కంపెనీలు వారికే చెందుతాయి. వారి దాయాదులైన జెంషెడ్ గోద్రేజ్ (75), స్మిత గోద్రేజ్ కృష్ణ (74)లకు అన్‌లిస్టెడ్ కంపెనీ అయిన గోద్రేజ్ అండ్ బోయ్స్, దా ని అనుబంధ సంస్థలు వస్తాయి. దీంతో పా టు ముంబైలోని 3400 ఎకరాల స్థలాలు, ఇతర భూములు దాయాదులకు చెందు తాయని గోద్రేజ్ గ్రూప్ తాజాగా విడుదల చేసిన ప్రకటన తెలిపింది. మొత్తం మీద గ్రూప్‌ను రెండు శాఖలుగా విభజిస్తున్నారు. ఒక శాఖను ఆది, నదీర్‌లకు, మరో శాఖను జంషెడ్, స్మితలకు అప్పగిస్తున్నారు.
1897లో స్థాపన
న్యాయవాది అయిన అర్దేశిర్ గోద్రేజ్, ఆయన సోదరుడు ఫిరోజ్‌షా గోద్రేజ్‌లు ఈ వ్యాపార సామ్రాజ్యానికి 1897లో పునాది వేశారు. వైద్య పరికరాల తయారీని ప్రారం భించి, ఆ వ్యాపారంలో విఫలం కావడంతో అటుతర్వాత తాళాల తయారీని చేపట్టి విజయం సాధించారు. అర్దేశిర్‌కు సంతానం లేరు. దీంతో సహజంగానే వ్యాపార వారసత్వం ఆయన తమ్ముడు ఫిరోజ్‌షాకు దక్కింది. ఫిరోజ్‌కు నలుగురు సంతానం సోహ్రాబ్, దోసా, బుర్జర్, నావెల్‌లు. కొన్ని ఏండ్లకు వారిలో ఇరువురి చేతికి వ్యాపారం మళ్లింది. అందులో బుర్జోర్ గోద్రేజ్ పిల్లలు (ఆది, నాదిర్), నావెల్ సంతానం (జంషెడ్, స్మిత) ప్రస్తుతం గోద్రేజ్ గ్రూప్ వారసులుగా ఉన్నారు. సోహ్రాబ్‌కు పిల్లలు లేకపోవడం, దోసాకు రిషాద్ అనే కుమారుడు ఉన్నప్పటికీ, ఆయనకు సంతానం కలగలేదు. దీంతో బుర్జోర్, నావెల్ వారసులే గోద్రేజ్ సామ్రాజ్యాన్ని ఇప్పటివరకూ నడుపుతూ వచ్చారు. తాజాగా ఇది రెండుగా విడిపోయింది.
విభజనకు వీలుగా రాజీనామాలు
గోద్రేజ్ వ్యాపారాన్ని సజావుగా విభజించే క్రమంలో ఆది, నదిర్‌లు గోద్రేజ్ అండ్ బోయ్స్ బోర్డు నుంచి రాజీనామా చేయగా, జంషెడ్ గోద్రేజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్ బోర్డుల నుంచి వైదొలిగారు. అలాగే గోద్రేజ్ అండ్ బోయ్స్ లో ఆది, నదిర్‌లకు ఉన్న వాటాలను, గోద్రేజ్ కన్జూమర్, గోద్రేజ్ ప్రాపర్టీస్‌లో జంషెడ్, స్మితల వాటాను పరస్పరం బదిలీ చేసుకుంటారని సమాచారం.
ఏరో స్పేస్, సాఫ్ట్‌వేర్ వ్యాపారాలు వీరికే
ఏరోస్పేస్, ఏవియేషన్, డిఫెన్స్, ఫర్నీచర్, ఐటీ సాఫ్ట్‌వేర్ తదితర పలు పరిశ్రమలు నిర్వహిస్తున్న గోద్రేజ్ అండ్ బోయ్స్, దాని అనుబంధ సంస్థలతో కూడిన గోద్రేజ్ ఎంటర్‌ప్రైజెస్‌కు ఇక నుంచి జంషెడ్ గోద్రేజ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నేతృత్వం వహిస్తారు. ఆయన సోదరి స్మిత కుమార్తె అయిన నైరికా హోల్కర్ (42) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. అలాగే ఈ కుటుంబాల వద్దే భూములు కూడా ఉంటాయి.
లిస్టెడ్ కంపెనీలివే ఆది, నదిర్ చేతుల్లోకి వెళ్లే గోద్రేజ్ ఇండస్ట్రీస్
గ్రూప్‌నకు పలు లిస్టెడ్ కంపెనీలున్నాయి. అవి..గోద్రేజ్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, గోద్రేజ్ ఆగ్రోవెట్, ఆస్టెక్ లైఫ్ సైన్సెస్‌లు. గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌నకు నదిర్ గోద్రేజ్ చైర్మన్‌గా ఉంటారు. ఈ కంపెనీలన్నింటినీ ఆది, నదిర్‌లు, వారి వారసులు నిర్వహిస్తారు. ఆది గోద్రేజ్ కుమారుడు పిరోజ్‌షా గోద్రేజ్ (42) ప్రస్తుతనికి గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌నకు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా కొనసాగుతారు. 2026 ఆగస్టులో చైర్మన్ బాధ్యతలు చేపడతారని గోద్రేజ్ గ్రూప్ తెలిపింది. విడిపోయిన రెండు గ్రూప్‌లూ గోద్రేజ్ బ్రాండ్‌ను భవిష్యత్తులో కూడా ఉపయోగించుకుంటాయి.






