కార్ల అమ్మకాలు అంతంతే
ఏప్రిల్‌లో 3.38 లక్షల పీవీలు విక్రయం
న్యూఢిల్లీ, మే 1: దేశీయంగా పాసింజర్ వాహన (పీవీలు) విక్రయాల్లో వృద్ధి కన్పించలేదు. దాదాపు గత ఏడాది ఏప్రిల్ తరహాలోనే ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెలలో 3.38 లక్షల పీవీలు మాత్రమే అమ్ముడయ్యాయి. ప్రస్తుత ఎన్నికల సీజన్ సందర్భంగా డిమాండ్ మందగించడం, గత ఏడాది ఏర్పడిన హయ్యర్ బేస్ ఎఫెక్ట్ ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. 2024 ఏప్రిల్‌లో తయారీదారుల నుంచి డీలర్లకు 3,38,341 పాసింజర్ వాహనాలు డెలివరీ అయ్యాయి. 2023 ఏప్రిల్‌లో ఈ సంఖ్య 3,32,468 యూనిట్లు ఉన్నది. దీంతో పోలిస్తే తాజాగా ముగిసిన నెలలో కేవలం 1.77 శాతం వృద్ధి నమోదయ్యింది.
జూన్ వరకూ ఇదే రీతి
గత ఏడాది నెలకొన్న హయ్యర్ బేస్ ఎఫెక్ట్‌తో పాటు లోక్‌సభ ఎన్నికల సీజన్‌లో డిమాండ్ మందగించిందని మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మీడియాకు తెలిపారు. ఎన్నికల ముగిసిన తర్వాత వాహన విక్రయాల ట్రెండ్ మారుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. జూన్ తర్వాత మార్కెట్ పుంజుకుంటుందని తాము భావిస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్ నెలలో మారుతి పీవీల అమ్మకాలు 1,37,320 యూనిట్ల నుంచి 1,37,952 యూనిట్లకు పెరిగాయి. హ్యుందాయ్ మోటా ర్స్ దేశీయ హోల్‌సేల్ అమ్మకాలు 1 శాతం వృద్ధితో 49,701 యూనిట్ల నుంచి 50,201 యూనిట్లకు పెరిగాయి. తమ అంచనాలకు అనుగుణం గా ఏప్రిల్‌లో వృద్ధి ఉన్నదని హ్యుం దాయ్ మోటార్స్ ఇండియా సీవోవో తరుణ్ గార్గ్ వివరించారు.
ఇది మందగమనంగా భావించరాదని, గత రెండేండ్లలో నెలకొన్న హయ్యర్ బేస్ ఎఫెక్ట్ కారణమని చెప్పారు. టాటా మోటార్స్ దేశీయ పీవీ విక్రయాలు ఎలక్ట్రిక్ వాహనాలతో సహా ఏప్రిల్ నెలలో 2 శాతం పెరిగి 47,007 యూనిట్ల నుంచి 47,883 యూనిట్లకు పెరిగాయి. టొయోటా కిర్లోస్కర్ హోల్‌సేల్ అమ్మకాలు మాత్రం 32 శాతం పెరిగి 15,510 యూనిట్ల నుంచి 20,494 యూనిట్లకు చేరాయి. ఎంజీ మోటార్స్ అమ్మకాలు 1.45 శాతం క్షీణించి 4,551 యూనిట్ల నుంచి 4,485 యూనిట్లకు తగ్గాయి.






