గల్ఫ్ మంటలు.. గ్యాస్ తిప్పలు
భయం.. భయం
హోటళ్లకు గ్యాస్ కట్.. హాస్టళ్లకు, ఆస్పత్రులకు ఓకే
- కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేస్తూ పెట్రోలియం కంపెనీల ఆదేశాలు
- గ్యాస్ నిల్వల పంపిణీపై కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
- గృహ వినియోగ గ్యాస్ బుకింగ్ గడువు 25 రోజులకు పెంపు
- ప్రత్యామ్నాయం చూపకపోతే రాష్ట్రవ్యాప్తంగా హోటల్స్ బంద్
- తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ వెల్లడి
న్యూఢిల్లీ, హైదరాబాద్, సిటీ బ్యూరో మార్చి 10 (విజయక్రాంతి): పశ్చిమాసియా లో 11 రోజులుగా కొనసాగుతున్న యుద్ధం వల్ల భారత్ ఇంధన భద్రతపై ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లను ఉపయోగించే హోటళ్ల పొయ్యి ఆరిపోనుంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధంతో చమురు, ఎల్పీజీ దిగుమతిపై తీవ్ర ప్రభావం పడింది.
దీంతో అప్రమత్తమైన కేంద్రం.. గ్యాస్ వినియోగంపై నియంత్రణ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా వ్యాపార అవసరాలకు వినియోగించే కమర్షియల్ సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేస్తూ పెట్రోలియం కంపెనీలు.. డీలర్లకు అత్యవసర ఆదేశాలు జారీచేశాయి. దీంతో ఇప్పటికే ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరులో పలు హోటళ్లను తాత్కాలికం గా మూసివేశారు.
తెలంగాణలో ఎల్పీజీ కొరతతో హోటల్ వ్యాపారం పూర్తిగా దెబ్బతినను న్నదని, రాష్ట్రవ్యాప్తంగా హోటళ్ల బంద్ నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలంగాణ హోట ల్స్ అసోసియేషన్ తెలిపింది. మరోవైపు, దేశంలో ఎల్పీజీ కొరత లేదని సరఫరాను స్థిరీకరించామని మంగళవారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దేశంలో ఉన్న రీఫైనరీలు ఎల్పీజీ ఉత్పత్తిని ౧౦ శాతం పెంచాయని పేర్కొన్నా యి.
పెట్రోలీయం ఉత్పత్తుల విషయంలో కూడా సంక్షోభం లేవని స్పష్టం చేశాయి. మన ముడిచమురు దిగుమతుల్లో ౭౦ శాతం హోర్ముజ్ జలసంధి నుంచి కాకుండ ఇతరమార్గాల్లో సమకూరుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముంబైలో ఇప్పటికే ౨౦ శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. రాబో యే రోజుల్లో సగం హోటళ్లు మూతపడతాయని ముంబై హోటల్స్ వర్గాలు తెలిపాయి.
సిలిండర్ల బ్లాక్ విక్రయాలను అడ్డుకునేందుకు చమురు కంపెనీలు బుకింగ్ వ్యవధిని ప్రస్తుతం ఉన్న 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచాయి. గృహ వినియోగదారులకు ఎల్పీజీ సకాలంలో అందడానికి, పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత తలెత్తకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల చట్టాన్ని (ఎస్మా) ప్రయోగించింది. గృహ వినియోగదారులు ఇకపై గ్యాస్ ఏజెన్సీలకు తప్పకుండా తమ వివరాలు (ఈకేవైసీ) ఇవ్వాలని చమురు సంస్థలు తెలిపారు. లేదంటే గృహావసరాలకు గ్యాస్ బుకింగ్ నిలిచిపోతుందని స్పష్టం చేశాయి.
చముకు, గ్యాస్ లభ్యతలో అంతరాయం లేకుండా కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఈ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీ నిర్వహించారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురితో ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. యుద్ధం కారణంగా సరిపడినంత గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో కేంద్రం ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
అందుబాటులో ఉన్న గ్యాస్‌ను ఏయే రంగాలకు సరఫరా చేయాలన్న దానిపై ఈ కమిటీ అధ్యయనం చేస్తోంది. దీని సిఫార్సుల మేరకే ఆయిల్ కంపెనీలు వాణిజ్య అవసరాలకు గ్యాస్ పంపిణీని నిలిపివేశాయి. ప్రాణాపాయ స్థితుల్లో ఉండే ఆస్పత్రులకు, విద్యార్థులు ఉండే హాస్టళ్లకు మాత్రమే ఎస్మా తరహాలో మినహాయింపునిచ్చి గ్యాస్ సరఫరా చేస్తున్నాయి.
బంద్ తప్పదు: హోటల్స్ అసోసియేషన్
కమర్షియల్ గ్యాస్ నిలిపివేయడంతో హైదరాబాద్‌లో తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ మంగళవారం అత్యవసరంగా సమావేశమైంది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. హోటల్ పరిశ్రమకు ఎల్పీజీ అనేది ప్రాణవాయువు లాంటిదని. కమర్షియల్ గ్యాస్ నిలిపివేయడం తమ వ్యాపారాలకు పెను విఘాతమని చెప్పారు. ఇప్పటికే ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో గ్యాస్ లేక చిన్నచిన్న హోటళ్లు మూతబడుతున్నాయని, అక్కడి సంఘాలు బంద్ పాటిస్తున్నాయి తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా హోటల్స్ బంద్ చేయడం మినహా వేరే దారి లేదని ఆయన హెచ్చరించారు. సమస్య ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో బయట భోజనం దొరకక బ్యాచిలర్స్, ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉంది. భోజన ప్రియులతో పాటు, నిత్యం హోటళ్లపై ఆధారపడి బతికే లక్షలాది మంది కార్మికులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఏయిర్ ఇండియా ఇంధన సర్‌చార్జ్‌లు..
విమానయానంపై కూడా యుద్ధ ప్రభావం పడింది. దేశీయ, అంతర్జాతీయ రూట్‌లలో దశలవారీగా ఇంధన సర్‌చార్జ్‌లను ఏయిర్ ఇండియా ప్రకటించింది. జెట్ ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఏయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు ఈ సర్‌చార్జ్‌లు తప్పడంలేదని ఏయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే టికెట్‌లు బుక్ చేసుకున్న వారికి ఈ సర్‌చార్జ్‌లు వర్తించవు.




