విమానాశ్రయంలో పేలిన తుపాకీ
- ఇద్దరికి గాయాలు
- వారణాసి ఎయిర్‌పోర్ట్‌లో కలకలం
లక్నో, ఆగస్టు 16: వారణాసి విమానాశ్రయంలో తుపాకీ పేలడంతో కలకలం రేగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం శివసేన పార్టీకి చెందిన నాయకుడు కమలేష్ రాయ్ తన భార్యతో కలిసి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం 1810 ముంబైకి వెళ్లాలని వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు. తనిఖీల్లో భాగంగా భద్రతా సిబ్బంది అతని వద్ద తుపాకీ, 21 రౌండ్ల కాట్రిడ్జ్‌ను గుర్తించారు.
తుపాకీని అధికారులకు ఇవ్వబోతుండగా ప్రమాదవశాత్తు పేలింది. తూటాలు అక్కడ ఉన్నవారిపైకి వెళ్లడంతో ఇద్దరు ఉద్యోగులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న న్యూ లక్ష్మి ట్రామా సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కమలేష్‌ను ఐదుగంటలపాటు విచారించి ఫూల్పూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆజంగఢ్ నివాసి అయిన కమలేష్ శివసేన ముంబైలో మాజీ కౌన్సిలర్. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే, ధనంజయ్ సింగ్‌లతో ఇతను దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.






