2 August, 2026 | 4:46 AM

పోలీసుల అదుపులో గుట్కా వ్యాపారి

28-05-2024 12:38 AM

మంథని, మే27: మంథనిలో గుట్కా వ్యాపారి రాచర్ల సత్యనారాయణకు చెందిన రహస్య స్థావరంపై గోదావరిఖని ఏసీపీ రమేశ్ ఆదేశాలతో మంథని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు వెంకటకృష్ణ, రాణి సిబ్బందితో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం రూ. 2 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. సత్యనారాయణ చాలా ఏళ్లుగా తన వ్యాపారానికి ఎవరూ అడ్డురాకుండా నెలనెలా ముడుపులు పంపిస్తూ దర్జాగా దందా చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. కాగా ఇన్నాళ్లు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిన దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పేరు మోసిన గుట్కా వ్యాపారిగా సత్యనారాయణకు గుర్తింపు ఉంది. పదేళ్ల క్రితం మంథనిలో అందిన కాడల్లా అప్పులు చేసిన సత్యనారాయణ తిరిగి చెల్లించకుడా ఐపీ పెట్టాడు. తర్వాత ఉల్లిగడ్డ వ్యాపారం మొదలుపెట్టి, ఆ వ్యాపారం మాటున గుట్కా, బియ్యం దందాతో పాటు రియల్ ఎస్టేట్‌లో అడుగు పెట్టి అనతికాలంలోనే అందనంత ఎత్తు ఎదిగాడు.