2 August, 2026 | 5:31 AM

ఘరానా బైకు దొంగల అరెస్టు

28-05-2024 12:35 AM

మునుగోడు, మే 27: కొంత కాలంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్న ఐదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర బైకు దొంగల ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.౯౦ లక్షల విలువైన ౬౭ బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ చందనాదీప్తి తెలిపిన వివారాల ప్రకారం.. నల్లగొండ జిల్లాకేంద్రంతోపాటు తిప్పర్తి, మిర్యాలగూడ, నార్కెట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట, భువనగిరితోపాటు ఏపీలోని పిడుగురాళ్ల, దాచేపల్లి, చిలకలూరిపేట, యెడ్లపాడు, మంగళగిరి, గుంటూరు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తూ పోలీసులకు సవాలుగా మారారు. నిందితులు తుపాకుల వెంకటేశ్, గువ్వల శబరీశ్ , గుంజి అంకమ్మరావు, మెట్టుపల్లి శ్రీకాంత్, ఆవుల వేణుపై రాష్ట్రంతోపాటు ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

నిందితులు రెండు ముఠాలుగా ఏర్పడి రెండు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో రద్దీగా ఉన్న ప్రదేశాల్లో, ఇంటి ముందు పార్కింగ్  చేసి ఉన్న బైక్‌లను తస్కరించేవారు. వీరిలో ఏ1 అయిన తుపాకుల వెంకటేశ్ బైక్ హ్యాండిల్ లాక్ విరగొట్టి బ్యాటరీ వైర్లను కలిపి దొంగలించేవాడు. ఆ బైక్‌ల నంబర్ మార్చి అదే రంగు, కంపెనీకి చెందిన మరో బైక్ నంబర్ అమర్చుతారు. తెలంగాణలో దొంగలించిన బైక్ లను ఆంధ్రలో, ఆంధ్రలో దొంగలించిన బైక్‌లను తెలంగాణలో మాయమాటలు చెప్పి అమ్మేవారు. వీరిలో ఏ2 గువ్వల శబరీశ్ బైకులను దొంగలించే సమయం లో ఎవరైనా ఎదురు తిరిగితే డమ్మీ పిస్టల్ చూపించి భయబ్రాంతులకు గురిచేసేవాడు. దొంగిలించిన బైక్ లను ఏ3 అంకమ్మరావు, ఏ౪ శ్రీకాంత్ నంబర్ ప్లేట్లు మార్చి దాచేవారు.

బైకులు అమ్మగా వచ్చిన డబ్బులను అందరూ సమానంగా పంచుకునేవారు. కాగా, గత సోమవారం నల్లగొండ పానగల్ బైపాస్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. నిందితులు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. వీరినుంచి బైకులు, మొబైల్స్, డమ్మీ పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ డీఎస్సీ శివరాం రెడ్డి, నల్గొండ టూ టౌన్ సీఐ డానియెల్ కుమార్, ఎస్సైలను ఎస్పీ అభినందించారు.