09-02-2026 01:37:38 AM
ప్రచారంలో దూసుకెళ్తున్న జీవిఆర్
పాల్వంచ, ఫిబ్రవరి 8, (విజయక్రాంతి): స్థానికంగా ఉంటూ సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగిన తనకు ఓటు వేసి గెలిపిస్తే పాలకుడిగా కాకుండా సేవకుడిగా మీ వెంట ఉండి ప్రజాసేవ చేస్తానని 47వ డివిజన్ సిపిఐ అభ్యర్థి గుర్రం వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజాస్వామ్యంలో పాలకవర్గం ప్రాధాన్యతను గుర్తించి పాల్వంచ పట్టణానికి ఎన్నికలు నిర్వహించాలనే తలంపుతో ఎమ్మెల్యే సాంబశివరావు కృషి ఫలితంగా కొత్తగూడం మున్సిపల్ కార్పొరేషన్ సాధించడం జరిగింది.
ఎంతకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీలు పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోయారో సమాధానం చెప్పి ఓట్లు అభ్యర్థించాలని జీవీఆర్ ( గుర్రం వెంకటేశ్వర్లు) డిమాండ్ చేశారు. పాల్వంచ పట్టణ పరిధిలోని 47వ డివిజన్ ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా పాల్వంచ పట్నానికి పాలకవర్గం లేక సమస్యలు తిష్ట వేశాయన్నారు.
మాజీ మంత్రిగారి ఇలాఖాలో కనీసం స్మశాన వాటిక లేకపోవడం శోచనీయమన్నారు. వీధి దీపాలు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యలతో 47 వ డివిజన్ ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఈనెల 11వ తేదీన జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం బలపరుస్తున్న సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఎన్నికల్లో ఆశీర్వదిస్తే 47వ డివిజన్లో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట 47 వ డివిజన్ కార్యదర్శి బర్ల వెంకటరత్నం, జాయింట్ సెక్రెటరీ అహ్మద్ జానీ, టిడిపి సీనియర్ నాయకులు, 47వ డివిజన్ ఇన్చార్జి కటారి చంద్రశేఖర్ రావు, కే వేణుగోపాలస్వామి, మేడిద రూపాస్, మేడిద కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.