ఉద్యోగులకు హెల్త్ కార్డుల పంపిణీ పట్ల హర్షం
త్వరలోనే పీఆర్సీ ప్రకటించాలి స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు సైదులు
ముషీరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు హెల్త్ కార్డులు అందజేయడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిందని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్(ఎస్టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ సైదులు అన్నారు. ఆదివారం మింట్ కాంపౌండ్లోని ఎస్టీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందించే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.
అలాగే, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న పే రివిజన్ కమిషన్(పీఆర్సీ)ని తక్షణమే ప్రకటించాలని, గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి బదిలీలు, పదోన్నతులు, ఖాళీల భర్తీ, సేవా నియమాలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం వంటి అంశాలపై చర్చించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యూ.పోచయ్య కోరారు. ఈ సమావేశంలో నాయకులు బండి నరసింహులు, దిల్షాద్, డా.మోత్కుల నారాయణ గౌడ్, బాలాజీ, సునీల్ తదితరులు పాల్గొన్నారు.






