విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన మోదీ
తక్షణమే రాజీనామా చేయాలి వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమాండ్
ముషీరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): దేశంలోని విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తక్షణమే రాజీనామా చేయాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 2014 నుంచి జరిగిన నీట్, సీబీఎస్‌ఈ, యూపీఎస్సీ, ఆర్‌ఆర్బీ, బ్యాంకింగ్, సైనిక నియామక పరీక్షల్లో అవినీతి, లీకేజీలు జరిగాయని ఆరోపించారు. దీనికి నైతిక బాధ్యత వహించి ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేసి దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఢిల్లీలో ఆజాద్ దీప్ నేతృత్వంలో జరుగుతున్న పరీక్షల లీకేజీలకు వ్యతిరేక ప్రజా పోరాటాలకు దళిత బహుజన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
అలాగే, ఎస్‌ఐఆర్ పేరుతో దళితులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కుల ఓట్లను తొలగించే కుట్రను భారత ఎన్నికల కమిషన్ ద్వారా మోదీ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆరోపించారు. మోదీ-షా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం నిర్వహించే ’చలో పార్లమెంట్’ కార్యక్రమంలో దళిత బహుజన పార్టీ శ్రేణులు పాల్గొంటాయని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ బి.ధర్మరాజు గౌడ్, రాష్ట్ర కార్యదర్శి పి.మోహన్ రావు, దళిత బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ గణేష్, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.






