02-10-2025 01:39:53 AM
అధర్మంపై ధర్మం గెలుపే విజయదశమి
దేశప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. అధర్మంపై ధర్మం విజయం సాధించిన సందర్భంగా మనం విజయదశమి జరుపుకుంటాం. ఈ పర్వదినం సందర్భంగా మనం గర్వం, అహం వంటి దుర్గుణాలకు స్వస్తి పలుకుదాం. సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేద్దాం.
ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి
దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా. ఈ పండుగ అన్యాయంపై న్యాయానికి దక్కిన విజయం, చీకటిపై వెలుగుకు దక్కిన విజయం. దేశ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
విజయదశమి ప్రతి ఇంటా ఆనందాలు నింపాలి
ఈ విజయదశమి ప్రతి ఇంట్లో ఆనందాలు నింపాలి. సత్యమేవ జయతే అనేది మన జాతీయ నినాదం. పండుగలు జరుపుకునేటప్పుడు పర్యావరణ ప్రమాదాలు, ఇతర ముప్పులతోపాటు అన్ని చెడులతో పోరాడటానికి, పచ్చని ఆరోగ్యకరమైన దేశాన్ని సృష్టించడానికి మనంతా సమిష్టిగా ప్రయత్నించాలి. దసరా పండుగ సందర్భంగా దివ్యమాత ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ప్రజలు సంపూర్ణ విజయం సాధించాలి
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. ప్రజలు చేపట్టిన అన్ని పనుల్లో సంపూర్ణ విజయాలను సాధించాలి. బంధుమిత్ర సమేతంగా కుటుంబసభ్యులతో కలిసి దసరా పండుగను ఆనందంగా జరుపుకోవాలి.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
హిందూ బంధువులకు దసరా శుభాకాంక్షలు
హిందూ బంధువులందరికీ దసరా శుభాకాంక్షలు. చెడు మీద సాధించిన విజయానికి చిహ్నంగా, దేశవ్యాప్తంగా ఆనందోత్సవాల మధ్య దసరా పండుగను వైభవోపేతంగా నిర్వహించుకోవడం మన సంప్రదాయం. దసరా మనలో కొత్త ఉత్సాహాన్ని నిపండంతోపాటు బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంది. రామాయణ మూల సూత్రాలను, అందులో దాగున్న విలువలను సమాజానికి బోధించే దసగా పండుగ, ప్రపంచం, సమాజం, కుటంబం వంటి విషయాలపైన మన కర్తవ్యాన్ని, మనుషుల మధ్య పరస్పర సంబంధాలు, మర్యాదాలను గుర్తు చేస్తుంది. ప్రపంచానికి స్త్రీ శక్తిని చాటుతుంది.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
చెడుపై మంచి విజయం సాధించిన రోజు
తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉన్నది. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయదశమి పేరుతో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు విజయదశమి నిదర్శనం. శమిపూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలయ్ బలయ్.. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం.. శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణకు ప్రత్యేకం. తెలంగాణ అప్రతిహత విజయాలతో అభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఈ పండుగ జరుపుకోవాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ప్రజల జీవితాలు గెలుపు దిశగా పయనించాలి
ఓటమి నుంచి రాష్ట్ర ప్రజల జీవితాలు గెలుపు దిశగా పయనించాలి. తొమ్మిది రోజుల బతుకమ్మ సంబురాలతోపాటు దేవీ శరన్నవరాత్రుల దుర్గమ్మ పూజల పర్వదినాలకు కొనసాగింపుగా విజయదశమిగా జరుపుకునే దసరా పండుగకు తెలంగాణ ప్రజా జీవనంలో ప్రత్యేక స్థానం ఉన్నది. దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. కార్యధీక్షులను అపజయాల నుంచి విజయాల దిశగా నడిపిస్తూ, ఏనాటికైనా ధర్మానిదే అసలు విజయం అనే స్ఫూర్తిని దసరా పండుగ మనకు అందిస్తుంది.
ఈ పండుగ విశిష్టతను గౌరవిస్తూ, జమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా, పాలపిట్టను రాష్ట్ర పక్షిగా నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర సాధన పోరాటంలో బతుకమ్మతోపాటు విజయదశమి స్ఫూర్తి ఇమిడి ఉన్నది. అదే స్ఫూర్తితో పదేళ్ల పాలనలో ప్రజలను ప్రగతి విజయాల దిశగా నడించాం. తాము ఎంచుకున్న లక్ష్యాలను చేరుకుని, నిత్య శుభాలతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నిండేలా దీవించాలని దుర్గా మాతను ప్రార్థిస్తున్నాను.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
అధర్మంపై ధర్మం గెలిచిన రోజు
అధర్మంపై ధర్మం గెలిచిన రోజుగా దసరా ప్రత్యేకతను కలిగి ఉన్నది. దసరా ప్రతి కుటుంబంలో ఆనందం నింపాలి. ప్రజలందరికీ సుఖసంతోషాలు, అభివృద్ధి, ఆరోగ్యం కలగాలి.
పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్
జీవితాల్లో ఆనందం, ఐక్యత సాధించాలి
ఈ దసరా పండుగ ప్రతి ఇంట్లో సుఖశాంతులు నింపి, ప్రజల జీవితాల్లో మరింత ఆనందం, అభివృద్ధి, ఐక్యతను ప్రసాదించాలి.
మంత్రులు సీతక్క, కొండా సురేఖ