తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
- తెలుగు ప్రజలకు తెలుగులోనే చెప్పిన ప్రధాని
- మన్ కీ బాత్‌లో తెలుగు భాషా దినోత్సవ ప్రస్తావన
- రాజకీయ నేపథ్యం లేని యువత రాజకీయాల్లోకి రావాలి
- మహిళలపై దాడులు సహించబోమని హెచ్చరిక
న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు’ అని తెలుగులోనే చెప్పటం విశేషం. నెల నెలా నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. ఎప్పటిలాగే తన ప్రసంగంలో పలు అంశాలను ప్రస్తావించారు. వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా ఈనెల 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
యువత రాజకీయాల్లోకి రావాలి
ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని యువత రాజకీయాల్లోకి రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగంలో చెప్పిన ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. వికసిత్ భారత్ లక్ష్యం సాకారం కావాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ‘ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువత రాజకీయాల్లోకి రావాలని ఈ ఏడాది నేను ఎర్రకోట నుంచి పిలుపునిచ్చాను. నా పిలుపునకు అద్భుత స్పందన వచ్చింది. మన యువత పెద్ద మొత్తంలో రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని తెలిపారు.
మహిళలపై దాడులు సహించం
మహిళలపై దాడుల చేస్తే సహించేది లేదని ప్రధాని హెచ్చరించారు. మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో లక్‌పతి దీదీ సమ్మేలన్ కార్యక్రమంలో ఆదివారం ఆయన ప్రసంగించారు. ‘మహిళల భద్రత చాలా ముఖ్యం. మహిళపై జరిగే దాడులను ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయరాదని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మళ్లీ సూచిస్తున్నాను. కుట్రదారుడు ఎవరైనా సరే.. వదిలిపె ట్టే ప్రసక్తే లేదు. మహిళపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు చట్టాలను మరింత కఠినతరం చేస్తున్నాం’ అని తెలిపారు. స్వయం సహాయ సంఘాల్లోని మహిళలు నెలకు కనీసం రూ.10 వేల ఆదాయం ఆర్జిస్తూ ఏటా రూ.లక్షకు మించి ఆదాయం సంపాదించేలా ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ కార్యక్రమం చేపట్టింది.






