ఇజ్రాయెల్ హెజ్బొల్లా భీకర పోరు
- వంద యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్
- ౩50 కత్యూషా రాకెట్లతో హెజ్బొల్లా ఎదురుదాడి
- మధ్య ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
- ఆత్మరక్షణ కోసమే ముందస్తు దాడులు: ఇజ్రాయెల్
- మా కమాండర్ హత్యకు ప్రతీకారం: హెజ్బొల్లా
టెల్ అవీవ్, ఆగస్టు 25: ఇజ్రాయెల్ హెజ్బొల్లా ఘర్షణ తార స్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు భీకర దాడులు చేసుకొంటున్నారు. హెజ్బొల్లాను పూర్తిగా ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ తన సర్వ శక్తులను ఒడ్డుతున్నది. దాదాపు 10 నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ేొగాజా్ హిజ్బొల్లా ఘర్షణ ఆదివారం కీలక దశకు చేరింది. వంద యుద్ధ విమానాలతో లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. హిజ్బొల్లా కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తున్నది. ఆత్మరక్షణలో భాగంగానే ముందస్తు దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించగా, గాజాపై దాడితోపాటు తన కమాండర్ హత్యకు నిరసనగా ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్నట్టు హెజ్బొల్లా ప్రకటించింది.
గగనంలో అగ్నికీలలు
కొద్దిరోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉన్న ఇజ్రాయెల్ మధ్య పరిస్థితి ఆదివారం తెల్లవారుఝామున ఒక్కసారిగా అగ్నిపర్వతంలా పేలింది. పక్కా వ్యూహంతో ఇజ్రాయెల్ తన వైమానిక దళంలోని వంద అత్యాధునిక యుద్ధ విమానాలతో హెజ్బొల్లా రాకెట్ లాంచర్లే లక్ష్యంగా విరుచుకుపడింది. ఉగ్ర సంస్థ రాకెట్ ప్రయోగ వేదికలన్నింటినీ ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. అందుకు హెజ్బొల్లా కూడా దీటుగానే స్పందించింది. ఇజ్రాయెల్‌పైకి విరామం లేకుండా 600 రాకెట్లు, వందలకొద్ది సాయుధ డ్రోన్లను ప్రయోగించింది. అయితే వీటిని తన ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థతో ఇజ్రాయెల్ గగనతలంలోనే పేల్చివేసింది.
ముందుగానే గుర్తించి దాడులు
హెజ్బొల్లా టాప్ కమాండర్ ఫవాద్ షుక్‌న్రు గత నెలలో లెబనాన్‌లో ఇజ్రాయెల్ క్షిపణి దాడిచేసి చంపేసింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం మొదలుకావచ్చనే భయాలు నెలకొన్నాయి. తన కమాండర్‌ను చంపి ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టిందని, ఇక తాము ఊరుకోబోమని హెజ్బొల్లా అప్పుడే ప్రకటించింది. అన్నట్టుగానే రెండుమూడు రోజులుగా లెబనాన్‌లోని తన ఆధీనంలో ఉన్న ప్రాంతంలో వేలకొద్ది కత్యూషా రాకెట్ లాంచర్లను మోహరించి దాడులకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ముందుగానే పసిగట్టింది. శత్రువు దాడిచేయటానికి ముందే తామే దాడిచేయాలని నిర్ణయించి వంద యుద్ధ విమానాలతో రాత్రి సమయంలో విరుచుకుపడింది.
వందలకొద్ది రాకెట్ లాంచ్ పాడ్లను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. వెంటనే తేరుకొన్న హెజ్బొల్లా ఎదురుదాడి మొదలుపెట్టింది. రెండుగంటల వ్యవధిలోనే 350 కత్యూషా రాకెట్లను ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించింది. మరోవైపు సాయుధ డ్రోన్లతోనూ విరుచుకుపడింది. వీటిలో చాలావాటిని ఇజ్రాయెల్ మిలిటరీ ఆకాశంలోనే పేల్చివేసింది. ఘర్షణ భీకరంగా మారటంతో ఇజ్రాయెల్‌లో 48 గంటలపాటు అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఆదివారం ఉదయం 4 గంటలకే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ భద్రతా విభావం క్యాబినెట్ సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.
ఏమిటీ కత్యూషా రాకెట్లు
ఇరాన్ మద్దతుతో లెబనాన్‌లో సమాంతర పాలన సాగిస్తున్న హెజ్బొల్లా వద్ద లక్షకుపైగా రాకెట్లు, క్షిపణులు, సాయుధ డ్రోన్లు ఉన్నట్టు అంచనా. వీటిలో అతి ప్రధానమైనవి కూత్యూషా రాకెట్లు. వీటిని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాటి సోవియట్ యూనియన్ తయారుచేసింది. కత్యూషా అనేది సోవియట్ మిలిటరీ పాట పేరు. అదే పేరుతో ఈ రాకెట్లు ప్రాచుర్యం పొందాయి. 1930 దశకంలో కత్యూషా రాకెట్ల తయారీ మొదలైంది. భారీ పేలుడుతో శత్రువుకు తీవ్ర నష్టం కలిగించే ఉద్దేశంతో వీటిని రూపొందించారు. వీటిని ప్రయోగించటం కూడా చాలా తేలిక.
మొదటి కూత్యూషా రాకెట్‌ను జార్జీ లాంగెమాక్, బోరిస్ పెట్రోపావ్‌లోవ్‌స్కీ, ఆండ్రీ కోస్తికోవ్ బృందం తయారుచేసింది. వీటిని ప్రయోగించే రాకెట్ లాంచర్ బీఎం కూడా ఈ బృందమే రూపొందించింది. ఈ రాకెట్లకు మొదట ఎం అని పేరు పెట్టారు. ఎం అంటే మినా (రష్యాలో నాది అని అర్థం), 13 అంటే 132 ఎంఎం కాలిబర్ రాకెట్. ఈ రాకెట్లను 1941 జూలైలో జర్మనీ సైన్యంపై మొదట ప్రయోగించారు. ప్రసుత్తం వీటిని ప్రత్యేకంగా రూపొందించిన ట్రక్‌పై నుంచి లాంచ్ చేస్తున్నారు.






