అదనపు కట్నం కోసం వేధింపులు
పాలు విరిగాయని కోడలిపై అత్తింటివారి దాడి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (విజయక్రాంతి) : అదనపు కట్నం కోసం కోడలిపై అత్తింటివారు అమానుషంగా దాడికి పాల్పడ్డారు. గురువారం పాలు కాచే సమయంలో పాలు విరిగాయని ఆమెపై దారుణంగా దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్‌నగర్ అల్లావుద్దీన్ బస్తీకి చెందిన హీనాబేగం(28)కి ఎల్లారెడ్డిగూడకు చెందిన హుస్సేన్(42)కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే, గత కొంత కాలంగా భర్త హుస్సేన్, అత్త అఫ్రోజ్ బేగం, ఆడపడుచు సోని, మరిదిలు తబ్రేజ్, ఆయూబ్‌లు ఆమెని శారీరకంగా, మానసికంగా వేధించసాగారు. పెళ్లి సమయంలో రూ.2 లక్షలు కట్నం ఇచ్చినా.. మళ్లీ అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నారు. ఈ క్రమంలోనే పాలు విరగొట్టావంటూ వారంతా కలిసి మెటల్ పైపుతో ఇష్టమొచ్చినట్లు కొట్టారు.
అంతటితో ఆగకుండా ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి హీనా చనిపోయిందని చెప్పారు. వారు హుటాహుటిన ఇంటికొచ్చి చూసేసరికి హీనా అపస్మారక స్థితిలో పడిపోయింది. వెంటనే బాధితురాలిని చికిత్స నిమిత్తం అమీర్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హీనా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.






