4 June, 2026 | 12:14 PM

చందుర్తి మండలంలో దారుణ ఘటన

04-06-2026 10:59 AM

మైనర్ బాలికపై వేధింపులు, బెదిరించి తీసుకెళ్లిన వైనం..

కేసు నమోదు చేసిన ఎస్ఐ జిల్లెల్ల రమేష్..

చందుర్తి,(విజయక్రాంతి): చందుర్తి మండలంలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా, అర్థరాత్రి ఇంటికి వచ్చి బెదిరించి తీసుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై తెలిపిన కథనం ప్రకారం..బాధితురాలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తన 14 ఏళ్ల కుమార్తెకు, మానాల గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలుడు గత కొంతకాలంగా ఫోన్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు.

నిరంతరం కాల్ చేస్తూ, పెళ్లి చేసుకోవాలని సదరు బాలుడు బాలికపై ఒత్తిడి తెస్తున్నాడు. ఈ క్రమంలో జూన్ 02 వ తేదీ రాత్రి 11:40 గంటల సమయంలో, బాధితురాలు తన కుమార్తె మరియు తల్లితో కలిసి నిద్రిస్తుండగా, నిందితుడు మరో బాలుడితో కలిసి ఇంటికి వచ్చాడు. ఫోన్ చేసి బయటకు రాకపోతే చంపేస్తామని బెదిరించడంతో, భయపడిన బాలిక ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్లింది.నిందితులు ఆమెను సమీపంలోని ఒక గుడిసె వద్దకు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించారు. అనంతరం నల్లటి హోండా యాక్టివా వాహనంపై అక్కడి నుండి పరారయ్యారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు.