ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు
ఒకరు మృతి, 13 మందికి గాయాలు.
చిట్యాల, జూన్ 03(విజయక్రాంతి ): అద్దంకి - నార్కెట్‌పల్లి రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కెట్‌పల్లి శివారులో రోడ్డు పక్కన ఆగివున్న డీసీఎం వాహనాన్ని ఒక మినీ ట్రావెల్ బస్సు వేగంగా వచ్చి వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.మినీబస్సులో అరుణాచలం నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. క్షతగాత్రులంతా తమిళనాడులోని అరుణాచలం క్షేత్రాన్ని దర్శించుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మినీ బస్సు నార్కెట్‌పల్లి శివారుకు చేరుకోగానే, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎంను బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి మినీ బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.
ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, వాహనదారులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.






