15 July, 2026 | 1:36 AM

హామీలు ఇచ్చి, మాట తప్పిన కాంగ్రెస్

05-07-2024 12:57 PM

హైదరాబాద్: హామీలు ఇచ్చి, మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, డిమాండ్ల సాధనే లక్ష్యంగా టిజిపిఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. 

సోకాల్డ్ ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా? తమ గోసను రిప్రజెంటేషన్ ద్వారా చెప్పుకునే అవకాశం కూడా లేదా? అని ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ ఒక వైపు ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ, నిరుద్యోగుల గొంతులను, హక్కులను అణగదొక్కే కుట్రలకు పాల్పడుతోందని మండిపడ్డారు.  ఇది ముమ్మాటికీ ప్రజాపాలన కాదు. "అప్రజాస్వామ్యపాలన." అన్నారు. ఉద్యోగాల కోసం పుస్తకాలు పట్టుకొని చదవాల్సిన విద్యార్థులను నడిరోడ్డుకు ఈడ్చి ధర్నాలు, ఆందోళనలు చేసే దుస్థికి తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని ఆరోపించారు. 

ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం తిప్పుకుంటే విద్యార్థులకు నిరుద్యోగులకు తోడు ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. సమస్యలు పరిష్కరించే దాక, డిమాండ్లు సాధించే దాకా వదిలిపెట్టమన్న హరీశ్ రావు విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున గొంతెత్తుతాం, నిర్వారామ పోరాటం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగుల అరెస్టులను తక్షణం నిలిపివేయాలని, నిర్బంధించిన వారిని, అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.