8 May, 2026 | 5:30 PM

రాజీనామాకు హరీశ్‌రావు రెడీగా ఉండాలి

23-06-2024 01:13 AM

కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సవాల్

హైదరాబాద్, జూన్ 22(విజయక్రాంతి) : రైతు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న మాటకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కట్టుబడి ఉండాలని, అందుకు  రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సవాల్ చేశారు. గతంలో కిరోసిన్ పోసుకుని అగ్గిపుల్ల కోసం వెతికినట్లుగా ఇప్పు డు చేయవద్దని సూచించారు. శనివారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియా హాల్లో ఎమ్మెల్యే శ్రీహరితో కలిసి మాట్లాడారు. రాష్ట్రం రూ.7లక్షల కోట్లవరకు అప్పులు ఉన్నప్పటికీ రూ. 2 లక్షల  రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తున్నామని పేర్కొన్నారు.

నిజమైన రైతులకు రైతుబంధు ఇస్తామని తెలిపారు. బీజేపీ సంపన్నుల రుణాలు మాఫీ చేసిందని, కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల రుణాలను మాఫీ చేస్తోందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి విమర్శించారు.  గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ జరిగిందని, ఇప్పు డు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకనే మళ్లీ  రైతు రుణాలను మాఫీ చేస్తున్నామన్నారు. రైతుల పక్షాన ఉండేది ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు.