మందుల కొరత లేకుండా చూస్తాం
ఆహార తనిఖీలు నిరంతర ప్రక్రియ
ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు
అధికారులతో సమీక్షలో మంత్రి దామోదర
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి) : సీజనల్ వ్యాధుల నిర్మూలనకు మందుల కొరత రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. టీఎస్‌ఎంఐడీసీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, బ్లడ్‌బ్యాంకులు, ఫుడ్ సేఫ్టీ విభాగాలతో పాటు అన్ని శాఖల్లోనూ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. హోటళ్లు, విద్యాసంస్థలు, హాస్టళ్లు సహా అన్ని చోట్ల తనిఖీలు చేపట్టి నాణ్యమైన ఆహారం అందేలా చూడాలన్నారు. నాచారం ఫుడ్‌సేఫ్టీ ల్యాబ్‌ను బలోపేతం చేయడంతో పాటు ఖాళీ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలని ఆదేశించారు.
బ్లడ్ బ్యాంకులకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేయాలన్నారు. రాష్ట్రంలో నకిలీ మందులే లేకుండా చూడాలని డ్రగ్ కంట్రోల్‌ను ఆదేశించారు. నాణ్యమైన మందులను ప్రజలకు అందించాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని దామోదర్ రాజనర్సింహ తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో అన్ని విభాగాలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సమీక్షలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్, ఐపీఎం డైరెక్టర్ డా. శివలీల, టీఎస్‌ఎంఐడీసీ ఉన్నతాధికారులు దేవేందర్ కుమార్, సురేందర్ రెడ్డి, జగదీష్, సుబ్బారావు పాల్గొన్నారు.






