రేవంత్ నువ్వు ముఖ్యమంత్రివా.? లేక రియల్ ఎస్టేట్ ఏజెంటువా.?
హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ముఖ్యమంత్రి(Harish Rao) రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నువ్వు సీఎంవా.. లేక రియల్ ఎస్టేట్ ఏజెంటువా?, ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ అమ్మకాలేనా? అని ప్రశ్నించారు. రాయదుర్గంలో భూములు(Rayadurg lands) అమ్మే కుట్రలు ఉపసంహకరించుకోవాలని హెచ్చరించారు. ఈ భూములు కొనుగోలు చేస్తే.. న్యాయపరమైన సమస్యలు తప్పవని సూచించారు.
''రాయదుర్గంలోని సర్వే నెం. 83/1లో ఉన్న 10.63 ఎకరాల భూమికి సంబంధించి ఆగస్టు 17, 21 తేదీలలో జరగాలన్న టీజీఐఐసీ (TGIIC) ప్రతిపాదిత వేలంను తక్షణమే నిలిపివేయాలి. సర్వే నెం. 83ను వారసత్వ ప్రదేశంగా ప్రకటించగా, ఎస్‌బీఐ (SBI), వక్ఫ్ హక్కులకు సంబంధించిన పోటీ యాజమాన్యపు వాదనలు ఇప్పటికే న్యాయ పరిశీలనలో ఉన్నాయి. ఇటువంటి వివాదాలు పరిష్కారం కాకుండా ఉన్నప్పుడు, మూడవ పక్షాల ప్రయోజనాలు ఏర్పడకుండా నిరోధించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు కూడా నొక్కి చెప్పింది. 2020లో రేవంత్ రెడ్డి మీరు ఈ రాయదుర్గం భూములకు రక్షణ కల్పించాలని కోర్టులను ఆశ్రయించారు.
ముఖ్యమంత్రి అయ్యాక, వివాదాస్పద ఆస్తిపై మూడవ పక్షాల హక్కులను సృష్టించగల వేలాన్ని ఇప్పుడు ఎలా అనుమతించగలరు? ప్రతిపక్షంలో ఒక వైఖరి, అధికారంలో మరొక వైఖరా?, హెచ్‌సీయూ (HCU) పర్యావరణ భూముల నుండి రాయదుర్గంలోని వారసత్వ రాతి భూముల వరకు, తెలంగాణ విలువైన ప్రజా ఆస్తులు ప్రమాదంలో పడుతున్నాయి. ప్రభుత్వం చట్టబద్ధమైన యాజమాన్యాన్ని నిర్ధారించి, ఈ వారసత్వ ప్రాంతాన్ని పరిరక్షించాలి. భూమి యాజమాన్య హక్కు, చట్టపరమైన హోదా నిశ్చయంగా నిర్ధారించబడే వరకు ఎటువంటి వేలంపాటను అనుమతించకూడదు. ప్రతిపాదిత వేలంపాటలను తక్షణమే నిలిపివేసి, భవిష్యత్ తరాల కోసం ఈ భూములను పరిరక్షించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.'' అంటూ హరీశ్ రావు ఎక్స్ లో పోస్టు చేశారు.






