13 August, 2026 | 11:05 AM

క్రషర్ మెషిన్‌లో పడి ఉద్యోగి మృతి

13-08-2026 10:02 AM

బాలానగర్‌ మండలం ఉడిత్యాలలో విషాదం

బాలానగర్ : క్రషర్‌ యంత్రంలో పడి ప్రైవేటు కంపెనీ ఉద్యోగి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన బాలానగర్‌ మండలం ఉడిత్యాల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన సాయికిరణ్‌ (38) ఉడిత్యాలలోని ఎస్‌ఎన్‌ఆర్‌ కంపెనీలో గత కొన్ని నెలలుగా సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం క్రషర్‌ యంత్రం వద్ద పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు చేయి యంత్రంలో ఇరుక్కొని, అందులో పడిపోయినట్లు తెలిపారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

వెంటనే సాయికిరణ్‌ను అంబులెన్స్‌లో జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలిసింది. మృతుడికి భార్య, రెండేళ్ల కుమార్తెతో పాటు 25 రోజుల పసిబాబు ఉన్నారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

అనుమతులపై అనుమానాలు

క్రషర్‌ కంపెనీ నిర్వహణకు సంబంధించి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నామని నిర్వాహకులు చెబుతున్నట్లు సమాచారం. కంపెనీకి అవసరమైన అనుమతులు లేవన్న ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ప్రమాదానికి అసలు కారణాలు, కంపెనీకి ఉన్న అనుమతులపై అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది. ఈ క్రషర్ మిషన్ కు సంబంధించి అనుమతుల మేరకు నడుతూస్తున్నాదా ? లేదా?  అని పలువురు పేర్కొంటున్నారు.