హరియాణాలో బీజేపీకి షాక్

08-05-2024 01:27:59 AM

ప్రభుత్వానికి మద్దతు  ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు

చండీగఢ్, మే 7: లోక్‌సభ ఎన్నికల వేళ హరియాణాలో బీజేపీ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. వీరు ముగ్గురు కూడా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని వెల్లడించారు. వీరి నిర్ణయంతో బీజేపీ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. హరియామా అసెంబ్లీలో మొత్తం 90 సభ్యులుండగా, మాజీ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, మరో స్వతంత్ర ఎమ్మెల్యే రంజిత్ చౌతాలా రాజీనామాలతో 88 పడిపోయింది. ‘బీజేపీకి 40 మంది సభ్యుల బలం ఉంది. పది మంది జేజేపీ, ఇతర స్వతంత్రులతో తొలుత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొంత కాలానికి జేజేపీ  మద్దతు ఉపసంహరించుకోగా, మరికొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి వైదొలిగారు. దీంతో నయాబ్ సింగ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. అందుకే ఆయన తక్షణమే రాజీనామా చేయాలి’ అని కాంగ్రెస్ హరియాణా అధ్యక్షుడు ఉదయ్ భాన్ డిమాండ్ చేశారు.