కవిత కస్టడీ పొడిగింపు

08-05-2024 01:02:19 AM

మే 14 వరకు.. తప్పు చేసిన ప్రజ్వల్‌నుదేశం దాటించారు

తప్పు చేయని తనను  అరెస్టు చేశారని కవిత కామెంట్ 

న్యూఢిల్లీ, మే 7: లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కవితకు మరోసారి చుక్కెదురైంది. ఆమె జ్యుడీషియల్ కస్టడీని మే 14వ తేదీ వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ లిక్కర్ కేసులో విచారణ కీలక దశలో ఉందని పేర్కొన్నారు. లిక్కర్ కేసులో కవిత పాత్రపై వారం రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఆమెనే ప్రధాన సూత్రధారి అని ఈడీ కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం కవిత మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తొలుత ఆమెను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆమెను తీహార్ జైలుకు పంపారు. ఏప్రిల్ 11న తీహార్ జైలులో కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కాగా, ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా తీహార్ జైలులోనే ఉన్నారు. ఆయనకు కూడా ఢిల్లీ కోర్టు మే 20 వరకు కస్టడీ పొడిగించింది.

ఇది అన్యాయం..

ఇక, కస్టడీ ముగిసిన సందర్భంగా కోర్టుకు వచ్చిన సందర్భంగా కవిత ప్రజ్వల్ రేవణ్ణ అంశంపై స్పందించారు. తప్పు చేసిన ప్రజ్వల్ రేవణ్ణను దేశం దాటించారని, ఎలాంటి తప్పు చేయని తనలాంటి వారిని అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది అన్యాయమని, వీటన్నింటినీ ప్రజలు గమనించాలని కవిత కోరారు.