ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్

08-05-2024 01:31:02 AM

భారీగా యుద్ధ ట్యాంకుల మోహరింపు

ఆపరేషన్‌లో 3 సొరంగ మార్గాల గుర్తింపు 

20 మంది హమాస్ మిలిటెంట్లు హతం

ఇజ్రాయెల్, మే 7: గాజాను ఈజిప్టుతో కలిపే కీలకమైన రఫా సరిహద్దు క్రాసింగ్‌ను ఇజ్రాయెల్ మంగళవారం తన అధీనంలోకి తీసుకుంది. గాజాలో కాల్పుల విరమణకు హమాస్ అంగీకరించినప్పటికీ ఇజ్రాయెల్ తన ఆపరేషన్‌ను కొనసాగిస్తూనే ఉంది. ముందురోజు ఎయిర్‌స్ట్రుక్స్ చేసిన ఐడీఎఫ్.. రఫాలో మంగళవారం ఏకంగా యుద్ధ ట్యాంకులను నడిపించింది. సోమవారం రాత్రి చేసిన లక్షిత దాడుల్లో సుమారు 20 మంది హమాస్ ఉగ్రవాదులు మరణించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. అంతేకాకుండా 3 సొరంగ మార్గాలను గుర్తించినట్లు తెలిపింది. ఆ తర్వాత అర్ధరాత్రి రఫా క్రాసింగ్‌ను నియంత్రణలోకి తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ క్రాసింగ్ వద్ద పెద్ద ఎత్తున ట్యాంకులను మోహరించడంతో పాటు ఇజ్రాయెల్ జెండా ఎగురుతున్న దృశ్యాలు మీడియాలో దర్శనమిస్తున్నాయి. 

కీలకమైన ప్రాంతంగా..

రఫా క్రాసింగ్ వద్ద కార్యకలాపాలన్ని నిలిచిపోయాయని పాలస్తీనా అధికారులు వెల్లడించారు. బాంబు దాడులు అధికంగా ఉండటంతో సిబ్బంది అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చిందని తెలిపారు. గాజా, ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న ఈ క్రాసింగ్‌పై గతేడాది ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది. దీంతో ఈజిప్టు ఈ క్రాసింగ్‌ను మూసేసింది. అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో మానవతా సాయం కోసం మళ్లీ దీన్ని తెరిచారు. అప్పటినుంచి గాజాలోని నిరాశ్రయులు, బాధితులకు ఈ మార్గం ద్వారా సాయం అందింది. చాలామంది పాలస్తీనీయులు, విదేశీయులు ఇదే మార్గం ద్వారా గాజాను వీడారు. కాగా, గాజాలో 40 రోజుల పాటు కాల్పుల విరమణ, 33 మంది బందీల విడుదలకు హమాస్ అంగీకరించింది. ప్రతిగా భారీస్థాయిలో పాలస్తీనా ఖైదీల విడుదల చేయాలని సూచించింది. అయితే, ఈ ప్రణాళిక తమ డిమాండ్లకు అనుగుణంగా లేదని, దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.