13 April, 2026 | 4:53 PM

ఇన్ని రోజులకు తీరిక దొరికిందా సీఎం సారూ..

28-06-2024 01:46 AM

బీఆర్‌ఎస్ నేత రాకేష్ రెడ్డి

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి):  సీఎం రేవంత్‌రెడ్డికి ఆరునెలల తరువాత వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అధికారికంగా పర్యటించడానికి తీరిక దొరికిందని బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ...  ప్రతిపక్ష పార్టీలపై దాడులు, డిల్లీ టూర్లు, కేసులు నమోదు చేయడం పూర్తి చేసుకున్నారని, తీరిగ్గా ఇప్పుడు జిల్లాల పర్యటనకు బయలుదేరారని అన్నారు. మొదటగా..  ఉద్యమాల గడ్డ ఓరుగల్లు జిల్లా పర్యటన ఎంచుకోవడం బాగానే ఉంది కానీ.. ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభించేందుకు రావడం విడ్డూరంగా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి  ఎంజీఎంను సందర్శించాలని, కేసీఆర్ శంకుస్థాపన చేసిన మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి పనులు త్వరగా పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలు తీర్చాలని, తెలంగాణ రాజముద్రలో కాకతీయ తోరణం ఉంచుతారో లేదో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి దయనీయంగా ఉందని, రోగులు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. వైద్య పరీక్షల కోసం ప్రైవేటు సంస్థలపై ఆధారపడాల్సి వస్తుందని, సర్కారు దవాఖానాల్లో రోగులకు సరైన వసతులు ఏర్పాటు చేయాలన్నారు.