ఆదాయాన్ని రెట్టింపు చేద్దాం
ఉద్యోగులతో సమీక్షలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 27 (విజయక్రాంతి): రిజిస్ట్రేషన్ శాఖ అధికారులందరూ అంకిత భావంతో పని చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ సూచించారు. గురువారం నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆ శాఖ ముఖ్య అధికారులతో పాటు డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఆ శాఖకు సంబంధించిన ఐదు ముఖ్యమైన సమస్యలు/సంస్కరణలపై అధికారులతో చర్చించారు. అనంతరం నూతన ఐజీగా బాధ్యతలు స్వీకరించిన బుద్ద ప్రకాశ్‌ను రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు స్థితప్రజ్ఞ, కోశాధికారి నరేశ్‌గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.




