23 June, 2026 | 11:27 AM

గాలివాన బీభత్సం: ఎర్రగడ్డలో కుటుంబం వీధి పాలు

23-06-2026 10:11 AM

తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండల పరిధిలోని ఎర్రగడ్డ గ్రామంలో సోమవారం కురిసిన భారీ గాలివాన తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈదురు గాలుల ధాటికి గ్రామానికి చెందిన గుండమ్మల నరేష్ ఇంటిపైకప్పు పూర్తిగా లేచిపోవడంతో కుటుంబం ఒక్కసారిగా నిరాశ్రయులైంది. ఇంట్లోని సామాగ్రి, నిత్యావసర వస్తువులు, పిల్లల పుస్తకాలు, బట్టలు వర్షానికి తడిసి నష్టపోయాయి. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే నరేష్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉండగా, ఉన్న ఒక్కగానొక్క ఇల్లు దెబ్బతినడంతో కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉంది. నిలువనీడ కోల్పోయిన బాధిత కుటుంబం ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో కన్నీరుమున్నీరవుతోంది. తమను ప్రభుత్వం, అధికారులు తక్షణమే ఆదుకుని అత్యవసర సహాయం అందించాలని నరేష్ వేడుకుంటుండగా, ఇంటి పునర్నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని గ్రామస్తులు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.