23 June, 2026 | 3:06 AM

చర్చలు సానుకూలం

23-06-2026 01:49 AM

ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ 

  1. చర్చల్లో పాల్గొన్న బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డ్డి 
  2. మెట్రో ఫేజ్‌| అనుమతులు, ఐఆర్‌ఎఫ్‌సీ రుణాలపై సుదీర్ఘ చర్చ
  3. సుముఖత వ్యక్తం చేసిన రైల్వే మంత్రి 
  4. నేడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్‌ను కలవనున్న రేవంత్ రెడ్డి, కిషన్‌రెడ్డి
  5. మెట్రోపై స్పష్టత వచ్చే అవకాశం  

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి) : తెలంగాణ అభివృద్ధి, హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్- ప్రాజెక్టు చుట్టూ సాగిన రాజకీయ హైడ్రామాకు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ముగింపు లభించింది. నిన్నమొన్నటి వరకు మెట్రో నిధుల విషయంలో పరస్పరం తీవ్ర విమర్శలు, సవాళ్లు విసురుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి.. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి, చివరకు సోమవారం ఒక్కటిగా వెళ్లి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలవడం హాట్ టాపిక్‌గా మారింది.  

రాజకీయం, లేఖల యుద్ధం రైల్వే మంత్రితో భేటీ వెనుక పెద్ద రాజకీయం, లేఖల యుద్ధమే నడిచింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ విస్తరణ కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదన పంపింది. ఈ విషయంలో కేంద్రం ఎటూ తేల్చకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మెట్రో విస్తరణలో కేంద్రం తన 50 శాతం వాటా తీసుకోవడానికి ముందుకు రానిపక్షంలో, నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ) ఇస్తే రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టును పూర్తి చేస్తుందని పలుమార్లు స్పష్టం చేశారు.

అంతేకాకుండా రుణం మంజూరు చేయకపోతే ప్రత్యామ్నామార్గాలను అన్వేషిస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో చొరవ చూపాలంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ముఖ్యమంత్రి లేఖలు కూడా రాశారు. అంతేకాదు.. హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం నిధులు ఇవ్వకుండా కిషన్‌రెడ్డే అడ్డుపడుతున్నారని, తెలంగాణకు ఆయన నయాపైసా లాభం చేయడం లేదంటూ గతంలో రేవంత్‌రెడ్డి బహిరంగంగానే తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అంతే ఘాటుగా స్పందించారు. తాను తెలంగాణ ప్రాజెక్టులను ఎన్నడూ అడ్డుకోలేదని, ఒకవేళ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైతే.. తనతో కలిసి వస్తే ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలుద్దామంటూ రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖల పరంపర తర్వాత, సీఎం రేవంత్‌రెడ్డి తన ఢిల్లీ పర్యటన ఖరారైన తరుణంలో.. కిషన్‌రెడ్డిని కూడా తనతో కలిసి రావాలని అధికారికంగా కోరారు. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రితో భేటీ ఏర్పాటు చేయించారు. ఇద్దరు నేతలూ కలిసి రైల్వే మంత్రి కార్యాలయానికి వెళ్లారు.  రెండు గంటలకు పైగా మెట్రో అంశంపై చర్చ జరిగింది.

రైల్వే మంత్రి సుముఖత వ్యక్తం చేశారు : రేవంత్

సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో చర్చలు సానుకూలంగా సాగాయని వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ అనుమతులు, ఐఆర్‌ఎఫ్‌సీ రుణాల మంజూరీపై సుదీర్ఘంగా చర్చించామని,  ఆయా అంశాలపై కేంద్ర మంత్రి సుముఖత వ్యక్తం చేశారని వెల్లడించారు.

మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో తాను, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ అవుతామని, అనంతరం మెట్రో విషయంలో క్లారిటీ వస్తుందన్నారు. కాగా రెండు విభిన్న ధృవాల లాంటి పార్టీలకు చెందిన ఇద్దరు అగ్రనేతలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వీధుల్లో చేతులు కలపడం ఆసక్తికరంగా మారింది.