4 May, 2026 | 1:59 AM

అతడితడేను.. వెరపెరుగడు పో!

04-05-2026 01:10 AM

శివాజీ తల్లావజ్ఝల :

సువిశాలమైన చిరునవ్వుతో నోరారా నోట్లో కిళ్లీ ఎరుపుతో మా భానుమూర్తి పలకరింపు ఉదయం దినపత్రిక ఆఫీసులో నాకు అచ్చం సూర్యోదయం లాగే ఉండేది. చెప్పొద్దూ, ఈశ్వరుడు భానుమూర్తికి ప్రసాదించిన నున్నని బట్టతల లోపల, వెలుపల భావోద్వేగం ఇట్టే పలుకుతుంది. విషయం ఏదన్నది కాదు, అట్టి దానిపై తనకు తోచిన ముక్క నిర్మొహమాటంగా అనక మానని నిష్కల్మష జీవి. అతని నోటి నుంచి సరఫరా అయ్యే మాటలకు అవతలి వారు ఏమవుతారన్నది సదా అప్రస్తుతం తనకు.

అదే ధోరణిలో మన చుట్టూ కొండ చిలువలా అల్లుకున్న తలతిక్క సమాజ వ్యవహారాలపై సెటైర్ శరసంధానం చేస్తుంటాడు రాతపూర్వకంగా. అతని రాతలన్నీ దాదాపు అవేను. రచనలో వ్యంగ్యమే తనకి ముచ్చట. పువ్వు చుట్టూ సీతాకోకచిలుక చక్కర్లు కొట్టినట్టు తన వ్యంగ్య రచనలో సన్నని హాస్యం తళతళలాడే పద్ధతి చూసుకుంటాడు. తను రాసిన ‘చల్నేదో బాలకిషన్’ ఇందుకు మంచి ఉదాహరణ. భానుమూర్తి రచనలన్నీ ఇలాగే నడుస్తూ వచ్చాయి.

ఇప్పుడిదిగో ఈ కొత్త నవల. వ్యంగ్యం దట్టించి అస్త్రాలతో మీ చేతికి చేరింది. నవల పేజీలు పాఠకులను పట్టి విడువవు. అదీ భానుమూర్తి రచనా శైలి. ఈ నవల అచ్చవడానికి ముందే నేను చదివాను గనుక భానుమూర్తి గుట్టు బయట పెట్టక తప్పింది కాదు. నవలలో గమ్మత్తుగా కథలోంచి కథ దశ్యాలు వరుస పెట్టి చదివించే పట్టుదల పాత్రలు ఉన్నాయి. అలవోకగా దోశ తిరగేసినట్టు సంఘటనలు దొర్లిపోతుంటాయి. బాధ్య తారాహిత్యంగా ఉండే ఓటర్లనే జీవులకు ఇందులోని సెటైర్ గుప్పెడు గుండు సూదు ల్లా గుచ్చుకోక మానవు మరి.

నిజానికి సర్వ అధికార స్థావరాల్లో గల సకల తైనతి గాళ్లనీ, వారి నాయకమాన్యులనూ కలిపి దుంపనాశనం చెయ్యగల వ్యంగ్య మంత్రోచ్ఛాటనలు, ఇందులోని వాక్యాలు అలా రాసి వెరుపెరగని రచయిత సత్తా ఇది. అలాగని ఈ పాటి రచనలే సామాజిక అనారోగ్య కారకులకు గుచ్చుకుని వేధిస్తాయా? కానిస్తురా.. తియ్!.. అని దులిపేసుకు పొయ్యే వారి కోసం కాదు వ్యంగ్య రచన. 

యుద్ధానికి దిగాక ఛాతిని చీరేసే ఇనుప మొగ్గల బాణాలే వాక్యాలుగా కావలసిన తక్షణావశ్యకాలని నెరనమ్మిన రచయిత భానుమూర్తి. కనుకనే తాను ఎక్కి పెట్టిన బాణాలు ఎవరినుద్దేశించినవో నవలలోని కాసిని పేజీల్లోనే స్పష్టం అవుతుంది. అలా వ్యంగ్య వ్యూహ పద రచన నేడు ఎంత అవసరమో కూడా పాఠకులకు గుర్తు చేస్తుంది నవల. చాలాకాలం తర్వాత నా కంటికి ఇలాంటి నవల ఎదురయింది.

ఇక్కడ నేను అంటే పాఠకుడిని అని.. ధోరణి తెలిసి వైఖరి స్పష్టమయ్యాకా మనం పసిగట్టలేని ఏదో గహన విచిత్రం నవలలో నడయాడతందని నేను చెప్పడం లేదు కానీ చదువుతుంటే ముచ్చటేదో తెలిసిపోతున్నా సరే సునిశిత హాస్యం, వ్యంగ్యం కలిసి చదువరిని ఆవహించడం మాత్రం ఖాయం. సినిమా చివర్లో ఆ చిన్న కుర్రవాడు ఆ భవనం మీద బలం చాలకపోయినా విసిరిన రాయి లాంటిదే ఈ నవల తాలూకు వ్యంగ్యాస్త్రం.

గతంలో ఒకనాడు అబూఅబ్రహం వంటి కార్టూనిస్టులు ఒక ప్రశ్నతో చికాకు పడ్డారు. తమ కార్టూన్లలో హ్యూమరసం చురుక్కుమనిపించగల సున్నిత స్థాయిలో రాజకీయాలు లేవు కనుక అసలు కార్టూనింగ్ మానుకోవాలా? అనుకునే దాకా జరిగింది కథ.. అంటే రాజనాల విలన్ హాస్యం చేస్తుండగా శ్రీమతి కృష్ణకుమారి కోపంగా అతనిపై పువ్వు విసిరినట్టన్నమాట! ఏదీ అధికార రాకాసి మూకకు చీమ చిటుక్కుమనదు. గనుక వ్యంగ్యం మానుకోవాలా? అని రచయితలు అనుకోరాదు.

ఎంత సెటైర్ కి అంత పదును.. మాఫలేషు కదాచన వ్యవహారం! కాబట్టి మర్యాద మీరిన కోపం, ఘాటైన వ్యంగ్యం పూసిన పదాలుగా అ సంధానం చెయ్యడం ముమ్మాటికీ ముఖ్యమని ఈ నవల మర్యాదగా చెప్తుంది. నవల బహుబాగుంది. చదవడం పూర్తికాగానే సమాజ రోగం కుదురుతుందని భయపడకండి. అసలిలాంటి నవల రాయడం మహా సాహసం! భానుమూర్తీ.. భలే పనిచేశావు పో!

(తెలిదేవర భానుమూర్తి నవల 

‘లత్కోర్ సాబ్’కు ముందుమాట)