15 June, 2026 | 1:24 AM

బడిబాటలో హెచ్‌ఎం జాడెక్కడ?

15-06-2026 12:00 AM

విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం

ఉపాధ్యాయులతోనే పనులు 

కొత్త హెచ్‌ఎంను నియమించాలని డిమాండ్

నాగలిగిద్ద, జూన్ 14: నాగలిగిద్ద మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్‌ఎస్)లో గత సంవత్సరం నుంచి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయ బాధ్యతలు నిర్వహిస్తున్న సిద్ధారెడ్డి పాఠశాల అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో తగినంత శ్రద్ధ చూపడం లేదని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో పాటు, ప్రధానోపాధ్యాయుడు విధులకు హాజరు కావడం లేదని వారు పేర్కొంటున్నారు.

నాగలిగిద్ద కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలను స్వయంగా సందర్శించకుండా, ఉపాధ్యాయులు, సీఆర్పీలను విజిట్లకు పంపిస్తున్నారని విమర్శిస్తున్నారు. ‘కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలను స్వయంగా ప్రధానోపాధ్యాయుడే సందర్శించకపోతే, అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల పనితీరు, విద్యా ప్రమాణాలు, సమస్యలపై సరైన అవగాహన ఎలా వస్తుంది? ఉపాధ్యాయుల పనిని ఎవరు పర్యవేక్షిస్తారు?‘ అంటూ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోతే విద్యా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. ప్రస్తుతం ఆయన ప్రధానోపాధ్యాయుడిగా, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడిగా కాకుండా సంగారెడ్డి జిల్లాలో జిల్లా స్థాయి అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బడిబాట‘ కార్యక్రమంలో కూడా ప్రధానోపాధ్యాయుడు పాల్గొనకపోవడం పట్ల గ్రామ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల చేరికలు పెంచడం, తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంపొందించడం లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడి గైర్హాజరు నిరాశ కలిగించిందని పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా, నాగలిగిద్ద మండల కేంద్రంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్ ప్రభుత్వ సహకారంతో ఎస్సీ బాయ్స్ హాస్టల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని గ్రామ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఈ పరిస్థితుల్లో పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు కోసం పూర్తి సమయం పాఠశాలలో అందుబాటులో ఉండే ప్రధానోపాధ్యాయుడిని నియమించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ‘జిల్లా స్థాయి అదనపు బాధ్యతల నుంచి సంబంధిత అధికారిని తప్పించి, నాగలిగిద్ద జడ్పీహెచ్‌ఎస్కు పూర్తి స్థాయి ప్రధానోపాధ్యాయుడిని నియమించి, పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తు, ప్రభుత్వ కార్యక్రమాల సమర్థ అమలుకు వెంటనే చర్యలు తీసుకోవాలి‘ అని గ్రామ ప్రజలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కోరుతున్నారు. 

నమ్మకం పెంచాలి..

ప్రభుత్వం నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు స్వయంగా పాల్గొని ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచాల్సిన బాధ్యత ఉంది. నాగలిగిద్ద మండలం వెనుకబడిన ప్రాంతం కావడంతో జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. నాగలిగిద్ద జడ్పీహెచ్‌ఎస్లో పూర్తి సమయం అందుబాటులో ఉండే ప్రధానోపాధ్యాయుడిని వెంటనే నియమించాలి. 

గణపతి, నాగలిగిద్ద

విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం..

మారుమూల ప్రాంతమైన నాగలిగిద్ద జడ్పీహెచ్‌ఎస్లో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పూర్తిస్థాయిలో పాఠశాలలోనే విధులు నిర్వహించేలా ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి.

 రమేష్, నాగలిగిద్ద