15 June, 2026 | 1:27 AM

ఆదాయం వసూళ్లు చేసి.. అభివృద్ధిని విస్మరించి..

15-06-2026 12:00 AM

చిన్న వర్షానికే చిత్తడిగా మారిన ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం 

అభివృద్ధికి నోచుకోని దుస్థితి

బస్టాండ్ వైపు రావాలంటే జంకుతున్న  ప్రయాణికులు, విద్యార్థులు మహిళలు

అలంపూర్ జూన్ 14: ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో ఉన్న చిరు వ్యాపారులతో ఆర్టీసీ అధికారులు నెల నెల క్రమం తప్పకుండా పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ..అధికారుల నిర్లక్ష్యానికి ప్రయాణ ప్రాంగణం అభివృద్ధికి నోచుకోలేక అనేక సమస్యలకు నిలయంగా మారింది.

దీంతో ఆర్టీసీ అధికారుల తీరుపై ప్రయాణికులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గద్వాల జిల్లాలో మానవపాడు మండల ప్రధాన కేంద్రంగా ఉన్న ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం ప్రస్తుతం సమస్యల నిలయంగా మారింది. బస్స్టాండ్ ఆవరణలో భారీ గుంతలు ఏర్పడటంతో చిన్నపాటి వర్షం కురిసినా నీరు నిల్వ ఉండి చెరువును తలపిస్తోంది. నిల్వ నీటితో దుర్వాసన వెదజల్లుతూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. దీని కారణంగా ప్రయాణికులు విద్యార్థులు అటువైపు వెళ్లేందుకు జంకుతున్నారు.

ప్రయాణికులకు కనీస సౌకర్యాలే కరువు

బస్స్టాండ్లో ప్రయాణికులు కూర్చునేందుకు కుర్చీలు లేవు.విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో రాత్రి వేళల్లో అంధకారం అలుముకుంటోంది.వేసవి కాలంలో ఫ్యాన్లు లేక ప్రయాణికులు ఉక్కపోతకు గురవుతున్నారు. మహిళలు, విద్యార్థులు, వృద్ధులకు అవసరమైన త్రాగునీటి సదుపాయం కూడా అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

శిథిలావస్థలో మరుగుదొడ్లు

మహిళా ప్రయాణికులకు అత్యంత అవసరమైన మరుగుదొడ్లు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి.ప్రస్తుతం ఉన్న టాయిలెట్ శిథిలావస్థకు చేరుకోవడంతో వినియోగించడానికి వీలులేని పరిస్థితి నెలకొంది.దీంతో మహిళలు, విద్యార్థినులు సమీప ప్రాంతాల్లోని ఇళ్లను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఆదాయం వస్తున్నా అభివృద్ధి శూన్యం

బస్స్టాండ్ ఆవరణలోని చిరు వ్యాపారుల నుంచి ప్రతి నెలా పన్నుల రూపంలో రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఆదాయం సమకూరుతున్నట్లు సమాచారం. అయినప్పటికీ ఆ ఆదాయానికి తగ్గట్టుగా కనీస అభివృద్ధి పనులు చేపట్టకపోవడంపై ప్రయాణికులు, వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రాంగణంలో పందులు, వీధి కుక్కలు స్త్వ్రర విహారం చేస్తున్నాయి.దీంతో ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు భయాందోళనలకు గురవుతున్నారు. పరిశుభ్రత లేకపోవడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హామీలు గాలిలో కలిసిన వైనం

గతంలో విధులు నిర్వహించిన ఆర్టీసీ డీఎం సునీత బస్స్టాండ్ ప్రాంగణంలో సిమెంట్ బెడ్ వేసి మరమ్మత్తులు చేపడతామని హామీ ఇచ్చారు. అయితే ఆమె బదిలీపై వెళ్లిపోవడంతో ఆ హామీ అమలు కాకుండానే నిలిచిపోయింది. దీంతో ఇక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. పట్టించుకునే వారే లేరని అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నత అధికారులు స్పందించి బస్టాండ్ ప్రయాణ ప్రాంగణాన్ని అభివృద్ధి పరచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ఉన్నత అధికారులు స్పందించాలి.. 

బస్టాండు ప్రాంగణంలో ప్రయాణికులు వినియోగించే కనీస వసతులు లేకపోవడం, గుంతల మరమ్మత్తు, త్రాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, కుర్చీలు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించి బస్స్టాండ్ను అభివృద్ధి చేయాలని దీనిపైన ఉన్నత అధికారులు చర్యలు చేపట్టాలి

- మూగి నాగన్న ,మానవపాడు