14-02-2026 12:00:00 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి13 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరాన్ని అహర్నిశలు శుభ్రంగా ఉంచుతూ, ప్రజల ఆరోగ్యం కోసం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల సంక్షేమంపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక దష్టి సారించింది. ఆధునిక జీవనశైలిలో చాపకింద నీరు లా విస్తరిస్తున్న క్యాన్సర్ మహమ్మారి బారిన పడకుండా తమ సిబ్బందిని కాపాడుకునేందుకు బల్దియా ఆరోగ్య భరోసా కార్యక్రమా నికి శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగా శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కార్కినోస్ హెల్త్ కేర్ భాగస్వామ్యం తో ఉద్యోగులు, పారిశుధ్య కార్మికుల కోసం మొబైల్ ఉచిత క్యాన్సర్ అవగాహన, స్క్రీనిం గ్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. కార్మికులకు నిర్వహిస్తున్న పరీక్షల తీరును, వైద్యుల సలహాలను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం తమకు అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశమని స్పష్టం చేశారు. ఇండియన్ క్యాన్సర్ సొసైటీ నిధులతో, కార్కినోస్ హెల్త్ కేర్ సహకారంతో ఈ ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే నగరవ్యాప్తంగా సుమారు 20 సర్కిళ్లలో ఈ మొబైల్ స్క్రీనిం గ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ శిబిరం లో కేవలం పరీక్షలే కాకుండా, క్యాన్సర్ పట్ల ఉన్న అపోహలను తొలగించేందుకు నిపుణులైన వైద్యులతో ప్రత్యేక కౌన్సిలింగ్ ఇప్పిం చారు. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తిస్తే పూర్తిస్థాయిలో నయం చేయవచ్చని వైద్యు లు వివరించారు. హెల్త్ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ శైలజ మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికులపై ప్రత్యేక ఫోకస్ పెట్టి ఈ శిబిరం నిర్వహించామన్నారు.
కార్మికులు ఏ లక్ష్మ మ్మ, జీ ప్రమీల మాట్లాడుతూ.. ముందు గా గుర్తిస్తే ప్రమాదం లేదని వైద్యులు చెప్పిన మాటలు తమకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు, కార్కినోస్ హెల్త్ కేర్ ప్రతినిధులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.