హుస్నాబాద్ ఏఎంసీలో ధాన్యం కుప్పలు
45 రోజులు గడిచినా కొనుగోలు శూన్యం! వానొస్తే రైతన్న ఆగమాగం
హుస్నాబాద్,ఏప్రిల్29: హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) ప్రాంగణంలో రైతులు తెచ్చిన ధాన్యం కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి. పంట కోసి మార్కెట్కు తరలించి 45 రోజులు దాటినా కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రైతన్నలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం బహిరంగ ప్రదేశాల్లో ఉండగా ఎప్పుడు వర్షం పడుతుందోనని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సమస్యలపై బీఆర్‌ఎస్ నాయకులు బుధవారం హుస్నాబాద్ ఏఎంసీని సందర్శించి రైతుల ఇబ్బందులను పరిశీలించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న జీపీఆర్‌ఎస్, ట్యాబ్ విధానాల వల్ల కొనుగోలు ప్రక్రియ మరింత మందగించిందని ఆరోపించారు.
జీపీఎస్ ట్రాక్ ఉన్న లారీల్లోనే ధాన్యం తరలించాలనే నిబంధనలతో రవాణా సమస్యలు పెరిగాయని, గ్రామీణ ప్రాంతాల్లో అటువంటి వాహనాలు తక్కువగా ఉండటంతో ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతోందన్నారు. ట్రాక్టర్లో ధాన్యం లోడ్ చేసిన తర్వాత ట్యాబ్లో దుబ్బాక మిల్లు చూపిస్తోందని, అక్కడికి ట్రాక్టర్ ఎలా తీసుకెళ్లాలని రైతులు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. మిల్లుల అలాట్మెంట్ ఆలస్యం కావడంతో మార్కెట్ యార్డులోనే ధాన్యం నిలిచిపోతోందన్నారు. తగిన షెడ్యూల్ లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు రోజూ మార్కెట్ చుట్టూ తిరగాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే పలువురికి చెల్లింపులపై మెసేజ్లు వచ్చినా ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని రైతులు ఆరోపిస్తున్నారని తెలిపారు.
వానాకాలం ముంచుకొస్తున్న వేళ మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోతే నష్టాన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. వెంటనే జీపీఆర్‌ఎస్ విధానాన్ని రద్దు చేసి, కొనుగోళ్లు వేగవంతం చేసి, రైతులకు గిట్టుబాటు ధరతో పాటు సకాలంలో చెల్లింపులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు వంగ వెంకటరామిరెడ్డి, రాయిరెడ్డి రాజిరెడ్డి, అన్వర్, ఎడబోయిన తిరుపతిరెడ్డి, కౌన్సిలర్లు గాదపాక రవీందర్, గడిపే సంపత్, ప్రభాకర్ రెడ్డి, జీవన్, బూర వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






