5 August, 2026 | 1:54 AM

శ్రీశైలానికి భారీగా వరద

05-08-2026 12:37 AM
  1. 2.48 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో.. 108 టీఎంసీలకు చేరిన మట్టం
  2. జూరాల ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తివేత
  3. 34.10 టీఎంసీలకు చేరిన ఎస్సారెస్పీ నీటి మట్టం
  4. పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్టు
  5. నిండు కుండలా ఎగువ మానేరు డ్యాం

విజయక్రాంతి నెట్‌వర్క్: ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా బేసిన్‌లో జలాశయాలకు వరద ప్రవాహం పెరిగింది. రెండు లక్షలకుపైగా క్యూసెక్కుల వరద వస్తున్నది. మంగళవారం సాయంత్రానికి జూరాల ప్రాజెక్టుకు 2.41 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, 33 గేట్లను ఎత్తి 2,21,331 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టికి ప్రస్తుతం 1.50 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదలచేస్తున్నారు. నారాయణపూర్‌కు 1,45,400 లక్షల క్యూసెక్కులు వస్తుండగా, 1,45,376  క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద వస్తున్నది.

ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 2,48,148 క్యూసెక్కుల జలాలు వచ్చి చేరుతున్నాయి. మహారాష్ట్రలో కురిసి వర్షాలతో గోదావరి బేసిన్‌లోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. మెదక్, కామారెడ్డి జిల్లాల మధ్య 1.820 టీఎంసీల సామర్థ్యం ఉన్న పోచారం ప్రాజెక్టులోకి 2,150 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అలుగు పోస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఎగువమానే పూర్తిస్థాయి నీటిమట్టం 31 అడుగులకు, 24 అడుగుల నీరు చేరింది. మరో ఏడడుగులు చేరితే మత్తడి దూకే అవకాశం ఉన్నది.

కామారెడ్డి జిల్లాలో 18 సెంటీమీటర్ల వర్షం 

కామారెడ్డి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు 18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతున్నది. కామారెడ్డి పెద్ద చెరువు అలుగులు వెళ్తున్నది. కామారెడ్డి సుభాష్ థియేటర్ వద్ద అర్ధరాత్రి రోడ్డుపై వరద నీరు ప్రవహించడంతో ప్రైవేట్ బస్సు పెళ్లి కోసం వస్తుండగా సైలెన్సర్‌లోకి నీరు వెళ్లడంతో మధ్యలోనే ఆగిపోయింది.

వెంటనే సంఘటన స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకొని బస్సులోని ప్రయాణికులను తాడు సాయంతో బయటకు తీశారు. పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లుతున్నది. సింగీతం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తారు. కళ్యాణి ప్రాజెక్ట్ మూడు గేట్లు ఎత్తారు. నల్లమడుగు ప్రాజెక్ట్ వద్ద జోరుగా వాగు ప్రవహిస్తున్నది. జిల్లాలో 18 వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.