ఆ జిల్లాలపై తీవ్ర వర్ష ప్రభావం: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్: వర్షాలకు నష్టపోయిన ప్రాంతాలపై అధికారులతో రివ్యూ చేశామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 8 జిల్లాలపై తీవ్ర వర్ష ప్రభావం పడిందని మంత్రి వెల్లడించారు. వర్షాలతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని శ్రీధర్ బాబు వెల్లడించారు. నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు బయటకు రావోద్దని ఆయన హెచ్చరించారు. అధికారులందరూ ఫీల్డ్ లో ఉండి పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. విద్యుత్తు, రహదారులను వెంటనే పునరుద్ధరించాలని కోరామన్నారు. రాష్ట్రస్థాయిలో డిజాస్టర్ రెస్పాన్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పది బృందాలను అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రతిపక్ష నేతలు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. వర్షాలతో ఇప్పటివరకు 16 మంది మరణించినట్లు మంత్రి వెల్లడించారు.






