01-09-2025 03:06:49 PM
అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండండి..
బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి..
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాతో పాటు బాన్సువాడ డివిజన్ లో మంగళవారం సెప్టెంబర్ 2వ తేదీ నుండి బాన్సువాడ డివిజన్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున డివిజన్ లోని అధికారులంతా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి(Sub-Collector Kiranmayi) తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ, ఇప్పటికే బాన్సువాడ డివిజన్ లో అధిక వర్షాల వలన కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అధిక వర్షపాతం కురిస్తే గ్రామస్థాయి నుండి డివిజన్ స్థాయి వరకు అధికారులు క్షేత్రస్థాయిలో చురుగ్గా వ్యవహరించి ముంపునకు గురయ్యే ప్రాంతాలు, అధికంగా ఓవర్ ఫ్లో అయ్యే ప్రాజెక్టులు, చెరువులు, ప్రమాదకరంగా ప్రవహించే వాగులు, వంకలు, తడిచిపోయిన పాత ఇండ్లు, భవనాలు, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు తదితర అన్ని ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేసి డివిజన్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆమె సూచించారు.
అదేవిధంగా గ్రామాలు, మండలాలు మున్సిపాలిటీల వారిగా ఎప్పటికప్పుడు పరిస్థితులను డివిజన్ జిల్లా స్థాయిలో తెలియజేయాలని ఆమె తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని సూచించారు. చేపల వేటకు వెళ్ళేవారు, పశువుల గొర్రెల కాపరులు నీటి పరివాహక ప్రాంతలలో అధికారుల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.