1 July, 2026 | 12:57 AM

మహేశ్‌బాబు థియేటర్‌పై భారీ జరిమానా

01-07-2026 12:00 AM

ప్రముఖ నటుడు మహేశ్‌బాబుకు చెందిన సినిమా థియేటర్‌కు భారీగా జరిమానా విధించింది వస్తు సేవల పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (జీఎస్‌టీఏటీ). మహేశ్‌బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్ సహా తెలంగాణ రాష్ట్రంలోని ఐదు థియేటర్లపై ఈ కఠిన చర్యలు తీసుకున్నది జీఎస్‌టీఏటీ. సినిమా టికెట్లపై కేంద్రం జీఎస్టీ తగ్గించినా టికెట్ గ్రాస్ రేట్ పెంచి అంతే డబ్బులు వసూలు చేశారని ఏఎంబీ సినిమాస్‌తోపాటు జ్యోతి థియేటర్, భ్రమరాంబ సినిమాస్, కుమార్ 70ఎంఎం, విశ్వనాథ్ 70ఎంఎం, ఏఎస్‌ఆర్ సినిమాస్ థియేటర్లపై జరిమానా విధించింది.

ఏఎంబీ సినిమాస్ ఇప్పుడు మొత్తం రూ.1.7 కోట్లలో రూ.35 లక్షలు జమ చేయాలని, జ్యోతి థియేటర్ రూ.19.8 లక్షలు, భ్రమరాంబ సినిమాస్ రూ.11.8 లక్షలు, కుమార్ 70ఎంఎం రూ.2.5 లక్షలు, ఏఎస్‌ఆర్ సినిమాస్ రూ.9.6 లక్షలు విశ్వనాథ్ 70ఎంఎం రూ.9 లక్షలతోపాటు 18% వడ్డీ కలిపి సంక్షేమ నిధికి చెల్లించాలని జీఎస్‌టీఏటీ ఆదేశాలు జారీ చేసింది.

మూవీ టికెట్లపై జీఎస్టీ రేట్లు తగ్గినా.. ఆ ప్రయోజనాన్ని ప్రేక్షకులకు వర్తింపజేయకుండా లాభపడినందుకు కేంద్ర జీఎస్టీ చట్టంలోని యాంటీ-ప్రాఫిటీరింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఈ మొత్తాన్ని వినియోగ దారుల సంక్షేమ నిధికి జమ చేయాలని ఆదేశించింది. మూవీ టికెట్లపై 2019 జనవరి 1 నుంచి జీఎస్టీని తగ్గించినప్పటికీ, సదురు థియేటర్లు బేస్ టికెట్ ధరలను పెంచి తుది ధరను యథాతథంగా ఉంచాయి.

దీంతో ప్రేక్షకులకు దక్కాల్సిన బెనిఫిట్స్ థియేటర్లే పొందాయని ట్రిబ్యునల్ నిర్ధారించింది. ఇక ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్న ఏఎంబీ వాదనను జీఎస్‌టీఏటీ తోసిపుచ్చింది. ప్రభుత్వ అనుమతులున్నా కేంద్ర జీఎస్టీ నిబంధనల నుంచి మినహాయింపు లభించదని స్పష్టం చేసింది.

ఏఎంబీ సినిమాస్ వాటాగా తేలిన రూ.1.౭ కోట్లలో ప్రస్తుతం రూ.35 లక్షలు జమ చేయాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు విశ్వనాథ్ 70ఎంఎం, ఏఎస్‌ఆర్ సినిమా, కుమార్ 70ఎంఎం థియేటర్లకు 2019, జూన్ 28 నుంచి 18 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉల్లంఘనలు 2020, జనవరి 1 కంటే ముందే జరిగినందున, సాంకేతిక కారణాల రీత్యా థియేటర్లపై ఎలాంటి అదనపు జరిమానాలు విధించలేదు.