1 July, 2026 | 1:18 AM

రైతుల ద్రోహి రేవంత్

01-07-2026 12:47 AM
  1. రైతుభరోసా నిధులు రూ.30 వేల కోట్లు ఎగ్గొట్టాడు
  2. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్ 

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): కేసీఆర్ రైతు బాంధవుడైతే.. రేవంత్‌రెడ్డి ఎప్పటికీ రైతు ద్రోహే.. అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రూ.30 వేల కోట్ల రైతుభరోసా నిధులు ఎగ్గొట్టడమే కాకుండా మళ్లీ సభల పేరిట నాటకాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. యూరియా కొరత నుంచి రైతుల దృష్టిని మళ్లించేందుకే  ఆశీర్వాద సభల పేరుతో నాటకాలు ఆడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ 30 నెలల ముదనష్టపు పాలనలో వ్యవసాయాన్ని దండగలా మార్చి రైతుల గొంతు కోస్తున్నారని మండిపడ్డారు. రైతుభరోసా సాయం కింద ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామని గ్యారెంటీలతో గారడీ చేసి.. అధికారంలోకి వచ్చాక ఒకటి, రెండు ఎకరాలకే అరకొరగా నిధులు విడుదల చేసి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు.

నాలుగుసార్లు రైతుభరోసా నిధులు ఎగ్గొట్టి 70 లక్షల మంది రైతుల ఉసురు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీని పావలా వంతు కూడా చేయకుండా అన్నదాతలను మోసం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమయమంతా ఢిల్లీ టూర్లకే సరిపోతుందన్నారు. రెండున్నర ఏళ్లలో 72సార్లు చేసిన ఢిల్లీకి వెళ్లారని విమర్శించారు. పనికిరాని మీటింగ్‌లకు ఖర్చు చేసిన డబ్బును ఆదా చేసి ఉంటే.. రైతులకు పెట్టుబడి సాయం దక్కేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.