1 July, 2026 | 12:51 AM

ఆలయాలకే భూ హక్కులు

01-07-2026 12:10 AM
  1. మార్కెట్ రేటు ప్రకారమే కేటాయించాలి
  2. యాదగిరిగుట్టపై తిరుమల మోడల్‌లో అతిథిగృహాలు  
  3. పునర్నిర్మాణ పనులు, నాణ్యతపై నివేదిక ఇవ్వండి
  4. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
  5. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి, భూ కేటాయింపులపై సమీక్ష

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి) : దేవాలయాల స్థలాలను ఎవరికి కేటాయించినప్పటికీ, వాటిపై పూర్తి యాజమాన్య హక్కులు మాత్రం ఆలయాలకే ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆల య సమగ్ర అభివృద్ధి, భూ కేటాయింపులపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ఎంసీహెచ్ ఆర్డీలోని సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ భూముల పరిరక్షణ, భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన నిర్మాణాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. యాదగిరిగుట్టలో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్‌కు భూమి కేటాయింపు విషయమై స్పంది స్తూ, సదరు భూమిని ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారమే కేటాయించాలని స్పష్టం చేశారు.

అలాగే ఆలయ పరిధిలో వివిధ మఠాలకు స్థలాలు ఇచ్చే అంశంపై స్పష్టమైన, పారదర్శకమైన విధానం రూపొందించాలని సూచించారు. కుల సంఘాలకు స్థలాల కేటాయింపులపై కూడా నిర్దిష్ట నిబంధనలతో కూడిన పాలసీని  సిద్ధం చేయాలని పేర్కొన్నారు. భూ కేటాయింపుల ప్రక్రియపై తిరుమలలో అనుసరిస్తున్న నిబంధనలు, విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. 

దాతలు, సంస్థల వివరాలతో జాబితా రూపొందించండి

దగిరిగుట్టపై భక్తుల వసతి కోసం నిర్మించతలపెట్టిన అతిథిగృహాల నిర్మాణంలోనూ తిరుమల మోడల్‌ను అనుసరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. కొండపై కాటేజీలు, గెస్ట్‌హౌస్ నిర్మాణాల కోసం ఆసక్తి చూపే దాతలు, సంస్థల వివరాలతో కూడిన జాబితాను తక్షణమే రూపొందించాలని, వీరికి విడతలవారీగా నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలని సీఎం స్పష్టం చేశారు.

ఆలయ పరిసరాల్లో భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పబ్లిక్- ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీటీ ) పద్ధతిలో  ప్రత్యేక టూరిజం సర్యూట్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణ పనులు, నాణ్యతపై గతంలో నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి, దానిపై వారం రోజుల్లోగా సమగ్ర నివేదిక అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.